నిర్దేశిత గడువు ప్రకారం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం-ఓడరేవులపై సిఎస్ సమీక్ష
అమరావతి : రాష్ట్రంలో నిర్మిస్తున్నభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తోపాటు పలు ఓడరేవుల నిర్మాణ పనుల ప్రగతిపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షిస్తూ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈవిమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ,అందుకు సంబంధించి ఏమైనా కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నా,ఆర్ధికపరమైన అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరగుతుందని స్పష్టం చేశారు.ఈఏడాదిలో ఎట్టిపరిస్థితుల్లోను అక్కడ నుండి విమాన రాకపోకలు సాగే విధంగా పనులు వేగవంతం చేయాలని విమానాశ్రయ నిర్మాణ సంస్థను,అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. అనంతరం రామాయపట్నం,మచిలీపట్నం,మూలపేట ఓడరేవుల నిర్మాణాల ప్రగతిని, పలు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ ప్రగతని సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. వీటి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువు ప్రకారం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర పరిశ్రమలు,పెట్టుపడుల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల ప్రగతిని వివరించారు. ఎటిసి,పరిపాలనా భవనం,పాసింజర్ టెర్మినల్స్ నిర్మాణాలు తదితర నిర్మాణాల ప్రగతిని వివరించారు.అలాగే నూతన ఓడరేవుల నిర్మాణానికి సంబంధించి వివరిస్తూ రామాయపట్నం ఓడరేవుకు సంబంధించి ఇప్పటి వరకూ 45 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.అదే విధంగా మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్టు వివరించారు. ఆయా పోర్టులకు సంబంధించి ఇంకా చేయాల్సిన భూసేకరణపై రెవెన్యూశాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి సకాలంలో సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ కు వివరించారు. అదే విధంగా మొదటి దశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు సుమారు 86 శాతం పూర్తయ్యాయని వచ్చే నెలలో వీటిని ప్రారంభించేందుకు వీలుగా మిగతా పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డా.యువరాజ్ వివరించారు. ఇంకా ఈసమావేశంలో ఎపి మారిటైమ్ బోర్డు సిఇఓ ప్రవీణ్ కుమార్, మచిలీపట్నం, మూలపేట,రామాయపట్నం పోర్టుల ఎండిలు ఎం.దయాసాగర్, సిహెచ్ బాబూరావు,పి.ప్రతాప్, ఎపి ఎంబిపి సిజిఎం ఆర్ మనోజ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.