పార్వతీపురం మన్యం : విద్యార్థుల మృతిపై పాచిపెంట మండలం సరాయివలస, మక్కువ మండలం యర్రసామంతులవలస (వై యస్ వలస) గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను రాష్ట్ర ఎస్టీ కమీషన్ ఛైర్మన్ డాక్టర్ డి వి జి శంకర రావు శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల మృతికి గల కారణాలను ఆరా తీశారు. విద్యార్థులకు అందుతున్న ఆహారం, వసతి సౌకర్యాలు తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి అందుతున్న ఆహారం, వసతి సౌకర్యాలు, విద్యా బోధన తదితర అంశాలను తెలుసుకున్నారు. ఆహారం బాగా తీసుకోవాలని హితవు పలికారు. ప్రోటీన్ కలిగిన పరిశుభ్రమైన ఆహారం అందించడంలో శ్రద్ద వహించాలని వార్డెన్ ను ఆదేశించారు. విద్యా బోధన, విద్యార్థుల చదువు, సురక్షితతో పాటు ఆరోగ్యంపై దృష్టి అవసరమని, గిరిజన బిడ్డల ప్రాణాలు కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, సురక్షిత చర్యలపై మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు గిరిజన విద్యకు, సౌకర్యాలకు వెచ్చిస్తుందని, అయినా ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని, జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆయన చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ద అవసరమని, తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారులు తరచూ తనిఖీలు చేయడం వంటి చర్యలు చేపట్టాలని, క్రింద స్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ ఉండాలన్నారు. వసతి గృహ నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సమస్యల పట్ల సమర్పించిన వినతి పత్రాలను ఛైర్మన్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సహాయ గిరిజన సంక్షేమ అధికారి కొన్నెళ్ల శ్రీనివాస రావు, ప్రధాన ఉపాధ్యాయులు రామారావు తదితరులు పాల్గొన్నారు.