కొప్పుల వెలమ జాతీయ కన్వీనర్ రావు సంబంగి
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలుచేయండి
బి.ఆర్.ఎస్ తొలగించిన బీసీ కులాలకు న్యాయం చేయండి
తక్షణమే బీసీ స్టేటస్ పునరుద్దరించండి
మీ చిత్తశుద్దిని నిరూపించుకుని బీసీ ల ఓట్లు అడగండి
పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా రెడ్డికి కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగి లేఖ
విజయవాడ : తెలంగాణలో కొప్పుల వెలమ తో పాటు 26(1) బీసీ కులాల బీసీ స్టేటస్ పునరుద్దరించుట గురించి కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డికి ఒక లేఖ రాశారు. 2014 జూన్ 2 న తెలంగాణ లో టి. ఆర్. ఎస్. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆగస్టు నెలలో 30 తేదీన తెలంగాణలో నివసిస్తున్న 26 (1) బీసీ కులాలను నిర్దాక్షిణ్యంగా బీసీ స్టేటస్ నుంచి తొలగించారు. దశాబ్దాల తరబడి తెలంగాణ లో నివసిస్తున్న లక్షలాది మంది తొలగించిన 26(1) బీసీ కులాల వారి అభిప్రాయాలు కాని, వివరణ గాని ఎందుకు తొలగించకూడదో అన్న అభ్యంతరాలు స్వీకరించకుండా పేపర్ ప్రకటన ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయంతో అప్పటి టి. ఆర్. ఎస్. ప్రభుత్వం మా 26(1) కులాలపై వేటు వేసింది. ముఖ్యంగా అప్పటి రాజధాని హైదరాబాద్ మహానగరంలో దశాబ్దాల తరబడి స్థిరపడ్డ ఉత్తరాంధ్ర , కోస్తా ఆంధ్ర ప్రాంతాల నుండి కొప్పుల వెలమలు చాలా ఇబ్బందులకు గురి అయ్యారు. ఒక్కసారిగా తెలంగాణలో కొప్పుల వారి జీవన స్థితిగతులు చిన్నాభిన్నం అయిపోయాయి. అంతేకాదు ఆంధ్రలో తల్లి తండ్రులు బీసీ గా ఉంటే తెలంగాణలో ఉన్న వారి పిల్లలు ఓసీ గా పరిగణింప బడుతున్నారు . ఈ హఠాత్ పరిణామం వలన ఎప్పటి నుండో నివాసం ఉంటున్న కొప్పుల వెలమలు వారి పిల్లలు విద్య ఉద్యోగ రంగాలలో వెనుకబడి పోయారు. దశాబ్దాల తరబడి ఇప్పటి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఉమ్మడి ఆంధ్ర , తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో ఉన్న కొప్పుల వెలమలు బీసీ లు గా గుర్తింపబడుతున్నారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కావున విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వారి హక్కులు , ఆస్తులు కాపాడవలసిన బాధ్యత గవర్నర్ దే నిర్ణయాధికారం. ఎన్నో సార్లు ప్రభుత్వం వారికి గవర్నర్ కి వినతి పత్రాలు ఇచ్చాము. కోర్టులకూ వెళ్ళాము. అప్పటి బి.ఆర్. ఎస్. ప్రభుత్వం మా మొర అలకించలేదు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే తొలగించిన 26(1) బీసీ కులాలను తిరిగి పునరుద్దరించి న్యాయం చేసే బాధ్యత తీసుకున్నట్టుగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ నినాదం కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా మారి అధికారం చేపట్టింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన 30 రోజుల తరువాత ప్రజావేదిక లో కూడా మా అభ్యర్ధన మరోసారి గుర్తు చేశాము. చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉండగా ఎన్నో సంస్కరణలు చేపట్టింది. మాట తప్పని మడమ తిప్పని రాజశేఖరరెడ్డి తనయగా, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మీరు పదవి చేపట్టిన నాటి నుండి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల నుండి తెలంగాణ కు వలస వెళ్ళిన 26 (1) కులాలు వారి తాలూకు బంధువులు ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఓటర్లు ఉన్నారు. మా అభ్యర్ధన మన్నించి సోనియాగాంధీ తో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మీరు మాట్లాడి ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణ లో తొలగించిన బీసీ కులాల వారికి తిరిగి బీసీ స్టేటస్ ఇచ్చేందుకు కృషి చేయగలరని మా నమ్మకాన్ని మీ ముందు ఉంచుతున్నాము. ఆంధ్రప్రదేశ్ లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మీ పాత్ర అత్యంత కీలకం. తెలంగాణ లో తొలగించిన 26 (1) కులాలకు జరిగిన అన్యాయం పరిష్కారం చేయడం ద్వారా ప్రతిష్టాకరమైన ఈ ఎన్నికలలో మీ సారధ్యం ఆంధ్రప్రదేశ్ లో మరింత శోభ పూరితమై అందరి మన్ననలు పొందగలదు. మీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని పొందగలదని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నామని ఆంధ్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగి పేర్కొన్నారు.