బీజింగ్ : అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాన్ని డ్రాగన్ దేశం చైనా చేస్తోంది. గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా? అసలు అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా? అనేది తెలుసుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం కోతులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. చైనా సొంతంగా ‘తియాంగాంగ్’ పేరిట స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టేషన్‌లోని వెంటియన్ మాడ్యుల్‌లోకి కోతులను పంపించనున్నారు.
గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేనిచోట వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. భార రహిత స్థితిలో వాటి మధ్య సంభోగం, ఆడ కోతుల్లో పునరుత్పత్తి జరుగుతాయో లేదో తెలుసుకుంటారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకొనే దిశగా ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో కోతుల పునరుత్పత్తిపై చైనా చేస్తున్న ప్రయోగాల ఫలితాలు కీలకంగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ప్రస్తుతం భూమి నుంచి 388.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇందులోని వెంటియన్ మాడ్యుల్లో ప్రస్తుతం ఆల్గే, చేపలు, నత్తలు వంటి చిన్న జీవులు జీవించడానికి అవకాశం ఉంది. కానీ, అవసరమైతే పెద్ద జీవులకు తగ్గట్లుగా పరిణామం పెంచుకొనేలా మాడ్యూల్‌ను డిజైన్ చేశారు. స్పేస్ స్టేషన్లోకి కోతులను పంపించగానే సరిపోదు, వాటికి ఆహారం అందజేయడం, ఆరోగ్యాన్ని కాపాడడం, వాటి వ్యర్థాలను నిర్వీర్యం చేయడం పెద్ద సవాలేనని చెప్పొచ్చు.