న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకృత నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయినట్లు ఆమె పేర్కొన్నారు. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్వీట్ చేశారు.
రెండవ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)నికర లాభం భారీగా 74 శాతం ఎగసి రూ.13,265 కోట్లుగా నమోదయ్యింది. కెనరా బ్యాంక్ లాభం 89 శాతం వృద్ధితో రూ.2,525 కోట్లుగా నమోదయ్యింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ లాభం 145% పెరిగి రూ.504 కోట్లుగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో లాభం 59 శాతం పెరిగి రూ.3,312.42 కోట్లుగా ఉంది. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) లాభాల్లో ఉన్నా, ఇవి 9–63 శాతం శ్రేణిలో క్షీణించాయి. అయితే మొండిబకాయిలకు అధిక కేటాయింపులు (ప్రొవిజినింగ్) దీనికి నేపథ్యం. పీఎన్బీ ప్రొవిజనింగ్స్ భారీగా రూ.2,693 కోట్ల నుంచి రూ.3,556 కోట్లకు చేరాయి. ఇక బీఓఐ విషయంలో ఈ కేటాయింపులు రూ.894 కోట్ల నుంచి రూ.1,912 కోట్లకు ఎగశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు 13 నుంచి 145 శాతం శ్రేణిలో ఉన్నాయి. యుకో బ్యాంక్ అత్యధికంగా 145 శాతం పెరిగితే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 103 శాతం పెరిగింది.
ఏప్రిల్–జూన్ త్రైమాసికం ఇలా : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. మొదటి త్రైమాసికంలో కూడా పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, సమీక్షా కాలంలో (2022 ఏప్రిల్–జూలై) రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది.
2021–22లో ఇలా : 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి.
2020–21 యూటర్న్ : నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది.