జమ్మూ కాశ్మీర్ లో సబ్-ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ స్కామ్‌పై దర్యాప్తునకు సంబంధించి సీబీఐ మంగళవారం దేశవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఈ ఆపరేషన్‌లో నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. జమ్మూ, శ్రీనగర్‌లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే హర్యానాలోని కర్నాల్, మహేందర్‌ఘర్, రేవారి, గుజరాత్‌లోని గాంధీనగర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసు విచారణలో డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ సహా పోలీస్‌శాఖలోని కొంతమంది, రిటైర్డ్ అధికారుల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు నేరారోపణ పత్రాలు, డిజిటల్ ఆధారాలు లభించినట్లు సీబీఐ ప్రతినిధి తెలిపారు.