హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని మొత్తం 68 స్థానాల్లో 412 మంది అభ్యర్థులు పోటీ పడగా వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మొత్తం 66.58 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నిన్న ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ మంచు, చలి కారణంగా మధ్యాహ్నం వరకు ఓటింగ్ మందకొడిగానే సాగింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. సిర్మౌర్ జిల్లాలో అత్యధికంగా 72.79 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, సముద్ర మట్టానికి 15,266 అడుగుల ఎత్తులో ఉండే లాహాల్, స్పితి జిల్లాలో అత్యల్పంగా 21.95 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 1.21 లక్షల మంది ఉండగా 38 వేల మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తున ఉండే తషిగాంగ్, కాజా ప్రాంతాల్లో ఉన్న 52 మంది ఓటర్ల కోసం పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు, అధికార పార్టీ బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేటికవే గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ రెండోసారి అధికారం చేపట్టకపోవడంతో ఈసారి తమదే గెలుపని కాంగ్రెస్ చెబుతోంది. అయితే, అభివృద్ధిని చూసి ప్రజలు తమకే పట్టం కడతారని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఇంకోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
40-45 సీట్లు గెలుస్తాం: కాంగ్రెస్
సిమ్లాలోని రాంపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్. అభివృద్ధికి ఓటు వేయాలని సూచించారు. 68 స్థానాల్లో 40-45 సీట్లు గెలుస్తాని దీమా వ్యక్తం చేశారు. సిమ్లాలోని సైనిక్
రెస్ట్ హౌస్ లాంగ్వుడ్ పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఆనంద్ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటేసిన కేంద్ర మంత్రి
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ థుమాల్, ఆయన కుమారు, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్లు తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.హమిర్పుర్లోని సమిర్పుర్ పోలింగ్ స్టేషన్లో ఓటు
వేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో సీఎం జైరాం ఠాకూర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకే మళ్లీ అధికారం ఇస్తారని అనురాగ్ ఠాకూర్ దీమా వ్యక్తం చేశారు.