దేశమంతా ఆ ఎన్నికల కోసమే ఆసక్తి
బీజేపీ ఉచితాలపై తన వైఖరి మార్చుకుంటుందా?
గుజరాత్లో శాసనసభ ఎన్నికలకు మరో కొన్ని రోజుల సమయమే ఉంది. ఇప్పుడు దేశమంతా ఆ
ఎన్నికల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆప్ అధినేత అరవింద్
కేజ్రీవాల్ ఉచిత పథక హామీలు కురిపిస్తుంటే బీజేపీ మాత్రం సైలెంట్‌గా ఉంది.
ఉచితాలను కాషాయ పార్టీ వ్యతిరేకిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆప్ ఉచితాలకు
ప్రజలు ఆకర్షితులై ఆ పార్టీకి పట్టం కడతారా? లేదంటే మళ్లీ బీజేపీని
గెలిపిస్తారా? బీజేపీ ఉచితాలపై తన వైఖరి మార్చుకుంటుందా? అన్నది అర్థం కావడం
లేదు. గుజరాత్.. భారతీయ జనతా పార్టీకి కంచుకోట. ప్రధాని నరేంద్ర మోదీ సొంత
గడ్డ. 1995వ సంవత్సరం నుంచి రాష్ట్రం బీజేపీ పాలనలోనే ఉంది. ఈ రాష్ట్రానికి
మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఖ్యాతి
గడించారు.
ఏ విధంగా చూసినా ఈ రాష్ట్రం బీజేపీకి చాలా కీలకం. 2022 చివర్లో జరగనున్న
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని బీజేపీ కంకణం
కట్టుకుంది. గతంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండగా ఈసారి కొత్తగా ఆమ్
ఆద్మీ పార్టీ బరిలో నిలిచింది. ఇక్కడే బీజేపీకి ఓ విషయంలో తలనొప్పి వచ్చి
పడింది. బీజేపీ ఉచితాలను వ్యతిరేకిస్తుండగా అనేక ఉచిత పథకాలు ప్రకటిస్తూ ఆప్
దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కురిపించే ఉచితాల జల్లుకు
గుజరాతీలు జై కొడతారా? రాష్ట్ర ఓటర్లు ఎటువైపు నిలుస్తారు? ఆప్ ఉచితాల
ట్రాప్‌లో బీజేపీ పడుతుందా?
2022 డిసెంబరులో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాష్ట్రంలో
ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల హీట్ మొదలైంది. పంజాబ్‌లో గ్రాండ్ విక్టరీతో మంచి
జోష్‌లో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌పై దృష్టి పెట్టారు. అనేక
ఉచిత హామీలను ప్రజలపై కురిపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్ర పర్యటనకు
వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఉచిత హామీని ఇస్తున్నారు. పేదలకు ఉచితంగా విద్య,
ఆరోగ్యం, కరెంట్ ఇవ్వలేని బీజేపీని గద్దె దించాలని ప్రజలను కోరుతున్నారు.
“నిజాయితీ లేని వ్యక్తి, అవినీతిపరుడు, దేశద్రోహి మాత్రమే ప్రజలకు ఉచితాలు
ఇవ్వడం వల్ల దేశం నాశనం అవుతుందని అంటారు. ప్రజలకు ఉచిత పథకాలు ఎలా ఇవ్వాలో
మాకు తెలుసు. ఈ విషయం అర్థం కాక భాజపా ఉచితాలను వ్యతిరేకిస్తోంది. ఉచితాలు..
దేశానికి మంచిది కాదని ఏ రాజకీయ నాయకుడైనా చెబితే అతడు ఉద్దేశం తప్పు అని
ప్రజలు అర్థం చేసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు.