పట్టు నిలుపుకున్న అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్
ఎగ్జిట్‌పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ సంప్రదాయంగా వస్తున్న ఫలితాలను
బద్దలు కొడుతూ సెనేట్‌పై అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ పట్టు నిలుపుకున్నారు.
రిపబ్లికన్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లుతూ, మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలన్న
డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షను పటాపంచలు చేస్తూ అమెరికా అధికార పార్టీ సత్తా
చాటింది. సెనేట్‌లో అవసరమైన 50 సీట్లను గెలుచుకున్న డెమొక్రాట్లు తమ కార్యవర్గ
అజెండా అమలుకు సిద్ధం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ రెండేళ్ల
పాలనకు రిఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమొక్రాట్లు సత్తా
చాటారు. సంప్రదాయంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చే మధ్యంతర ఎన్నికల
ఫలితాల ధోరణి ఈసారి మారింది. ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రాట్లు అమెరికా
సెనేట్‌పై నియంత్రణ నిలుపుకున్నారు. మధ్యంతర ఎన్నికల్లో బైడెన్‌కు షాక్
తప్పదని, రిపబ్లికన్ల జోరు ముందు డెమొక్రాట్లు బేజారుకాక తప్పదన్న ఎగ్జిట్
పోల్ అంచనాలు తలకిందులయ్యాయి.పెరిగిన ద్రవ్యోల్బణం, తగ్గిన బైడెన్ ప్రజాదరణ నేపథ్యంలో చట్ట సభల్లో పట్టు
సాధించాలనుకున్న రిపబ్లికన్ల ఆశలపై మధ్యంతర ఫలితాలు నీళ్లు చల్లాయి. నెవాడాలో
డెమొక్రాట్ అభ్యర్థి క్యాథరీన్ కోర్టెజ్ మాస్టో గెలుపుతో సెనేట్‌లో
డెమొక్రాట్లకు అవసరమైన 50 సీట్ల మెజారిటీ వచ్చేసింది. ఎగువ సభలో ఏదైనా
బిల్లుకు 50-50ఓట్లు వస్తే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కీలకమైన ఓటు వేసే
అవకాశం ఉంది. దీంతో సెనేట్ పూర్తిగా డెమొక్రాట్ల నియంత్రణలోకి వచ్చినట్లేనని
తెలుస్తోంది. జార్జియా సెనేట్ ఎన్నిక ఫలితాలు డిసెంబర్ 6న వెలువడనున్న
దృష్ట్యా ఇది కూడా డెమొక్రాట్ల ఖాతాలో చేరితే సెనేట్‌లో మెజారిటీ మరింత
పెరగనుంది. ఫలితాలపై స్పందించిన అగ్రరాజ్య అధినేత జో బైడెన్… 2024
ఎన్నికల్లోనూ డెమొక్రాట్ల గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సెనేట్‌పై నియంత్రణ
బైడెన్‌కు మంచి అవకాశమన్న వాదన ఉంది. దేశీయ, విదేశీ వ్యయ విధానం సహా పలు కీలక
ప్రతిపాదనల ఆమోదానికి మార్గం సుగమం కానుంది.
ప్రతినిధుల సభపై రిపబ్లికన్లు సానుకూలంగా ఉన్నప్పటికీ మధ్యంతర ఎన్నికలు మాత్రం
వారికి ఆశాజనక ఫలితాలు మాత్రం అందించలేదు. రిపబ్లికన్ పార్టీ కూడా సెనేట్‌లో
49 స్థానాలు దక్కించుకున్నప్పటికీ వారు మరిన్ని స్థానాలను ఆశించారు. ఈ
ఫలితాలతో రిపబ్లికన్ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే
వారం జరగాల్సిన పార్టీ నాయకత్వ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ముగ్గురు
రిపబ్లికన్ సెనేటర్లు లేఖ రాశారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల వైఫల్యంతో
తాము తీవ్ర నిరాశ చెందామని, దానికి అనేక కారణాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
2024లో గెలవాలంటే అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని, దాని కోసం తీవ్ర చర్చలు
జరగాలని వెల్లడించారు. సెనేట్ ఫలితం అనంతరం.. ‘పాత పార్టీ చచ్చిపోయింది.
దాన్ని పాతిపెట్టే సమయం వచ్చింది. కొత్తగా ఏదైనా నిర్మించాలి’ అని మిస్సౌరీకి
చెందిన రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలీ ట్వీట్ చేశారు. 2024 అధ్యక్ష ఎన్నిక
పోటీపై ట్రంప్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ఆయనకు ఆశనిపాతంలా మారాయి.