దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పాశవిక ఘటనలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఓ యువకుడు దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికిన విషయం తెలిసిందే. హత్య జరిగిన ఐదు నెలల తర్వాత ఈ విషయం బయటపడింది. ప్రియురాలిని ఆ యువకుడు 35 ముక్కలుగా నరికి.. కొన్నిరోజుల పాటు వాటిని ఢిల్లీ లోని మొహ్రౌలీ ప్రాంతంలో పడేశాడు. ప్రియురాలు శ్రద్ధా వాకర్ హత్యపై అధికారులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. నిందితుడు ఆప్తాబ్ పోలీసు కస్టడీని మరో ఐదు రోజులు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. వాకర్ మరణంపై వారి దర్యాప్తులో భాగంగా, ముంబై పోలీసులు హతురాలితో కలిసి ఆప్తాబ్ నగరాన్ని విడిచిపెట్టిన తర్వాత సందర్శించిన ప్రదేశాలకు తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు యత్నించారురు.
హత్య నేపథ్యమిదీ…
శ్రద్ధా వాకర్ (26), అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) ముంబైలోని ఓ కాల్సెంటర్లో పనిచేసేవారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న వీరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ముంబై నుంచి దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి వచ్చేసి సహజీవనం చేయసాగారు. ఈ క్రమంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరిగాయి. మే నెల మధ్యలో ఓ రోజు ఘర్షణ పెరిగి పెద్దదైంది. దీంతో అఫ్తాబ్ ఆమెను చంపేశాడు..అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఆ భాగాలను నిల్వ చేసేందుకు 300 లీటర్ల ఫ్రిజ్‌ను కొన్నాడు. రోజూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో శరీర భాగాలను తీసుకెళ్లి ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసి వచ్చాడు. ఇలా 18 రోజుల పాటు చేశాడని పోలీసులు తెలిపారు.