ఉద్యోగుల సహకారంతోనే క్షేత్రస్థాయిలో పథకాలు విజయవంతంగా అమలు
ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి
అమరావతి సచివాలయం : ఉద్యోగులకు సంబందించిన ఏ విషయంలోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి కాదు, లేదు అని ఎప్పుడూ అనరని, అవకాశం ఉన్నంత వరకూ
సాద్యమైనంత మేర ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకే ఆయన ప్రాధాన్యత
నిస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో ప్రభుత్వ సలహాదారులు (ఉద్యోగుల
సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి కి నూతనంగా కేటాయించిన చాంబరును ఆయన
ప్రారంభించిన తదుపరి ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో పలు ఉద్యోగ సంఘాల
ప్రతినిధులు, ఉద్యోగులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు)
సజ్జల రామకృష్ణా రెడ్డితో కలసి ప్రసగించారు. ఈ సందర్బంగా మంత్రి
బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమానికై
ప్రత్యేకంగా సలహాదారుని నియమించిన దాఖలాలు లేవన్నారు. అయితే తమ ప్రభుత్వం
మాత్రమే ప్రభుత్వానికి, ఉద్యోగులకు మద్య వారధిగా ప్రత్యేకంగా ఒక సలహాదారుని
నియమించడం జరిగిందన్నారు. ఈ సలహాదారుని ద్వారా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం
దృష్టికి తీసుకువచ్చి సాద్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించుకునేందుకు
ప్రభుత్వం ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించిందన్నారు. అదే విధంగా ఉద్యోగుల
డిమాండ్లకు సంబంధించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వనరులు, ఆర్థిక పరిస్థితులకు
అనుగుణంగా ఉద్యోగుల అన్ని డిమాండ్లను ప్రభుత్వం సాధ్యమైనంత మేర సానుకూలంగా
పరిష్కరించిందన్నారు. తెలంగాణా రాష్ట్రంతో తీసిపోని విధంగా రాష్ట్ర
ఉద్యోగులకు 11 వ పి.ఆర్.సి.ని అమలు చేయడం జరిగిందన్నారు. 15 నుండి 18 శాతం
వరకూ అదనంగా ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును
62 సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు. అదే విదంగా ఉద్యోగుల సంక్షేమంతో పాటు
సమాజంలో అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి అంశంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక
దృష్టి సారించిందన్నారు. ఎటు వంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రత్యక్ష
ప్రయోజనం బదిలీ విధానం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్దిచేకూర్చే విధంగా ఒక
క్రమ పద్దతిలో ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదన్నారు. అయితే ఓటు కోసమే
ఈ పథకాలను అమలు చేస్తున్నారని అనుకోవడం ఒక భ్రమ అన్నారు. ప్రభుత్వ
సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని
నిస్సహాయులను ఉద్దరించేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జగన్
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వినూత్న పధకాలు విజయవంతంలో ఉద్యోగులు కీలక భూమిక
పోషిస్తున్నారని కితాబిచ్చారు. ఉద్యోగులు అంతా తమ టీమ్ లో ప్రముఖ
భాగస్వామ్యులే అనే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారని,
ఉద్యోగుల సమస్యలను సాద్యమైనంత మేర పరిష్కరించాలని, వారికి లబ్దిచేకూర్చాలని
ముఖ్యమంత్రి అంటూ ఉంటారని ఆయన అన్నారు. ఆర్థికేతర సమస్యలను అన్నింటినీ
సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం
జరుగుచున్నదని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక పరమైన
డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.
ఉద్యోగుల డిమాండ్లను సాద్యమైనంత మేర పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా
ఉందని, పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను ఉద్యోగులకు స్పష్టంగా
వివరించడం జరుగుచున్నదన్నారు. అంతేగాని గతంలో మాదిరిగా ఉద్యోగ సంఘాల మధ్య
విభేదాలు సృష్టించి వారిని తమ ఓటు బ్యాంకులా మార్చుకునే కుతంత్రాలను తమ
ప్రభుత్వం చేయడం లేదన్నారు. సమాజంలోని నిరుపేదల అభ్యున్నతికి, సంక్షేమానికి
తమ ప్రభుత్వం ఎంతో నిజాయితీతో, నిబద్దతతో పారదర్శకంగా చేస్తున్న కృషికి
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సంపూర్ణంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్జీవో
అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర రెవిన్యూ శాఖ అసోషియేషన్
అద్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు
వెంకట్రామిరెడ్డి తదితరులతో పాలు పలు ఉపాద్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు.