రిపబ్లికన్లు మెజార్టీ సాధించారు. ఆ పార్టీకి చెందిన కెవిన్ మెక్‌కార్తీ
స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన రెండేళ్ల పాలనలో అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రతినిధుల సభలోని రిపబ్లికన్ల నుంచి పలు అంశాల్లో
ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.
నాలుగేళ్ల విరామం తర్వాత అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు
పట్టు సాధించారు. 435 మంది సభ్యులు గల ప్రతినిధుల సభలో మెజార్టీకి అవసరమైన 218
స్థానాలను సొంతం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన
డెమొక్రటిక్ పార్టీ 211 స్థానాల్లో నెగ్గింది. మరో 6 స్థానాల్లో ఇంకా ఓట్ల
లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌లోని మరోసభ సెనేట్‌లో ఇప్పటికే 50 స్థానాలు
సాధించి మెజార్టీ సొంతం చేసుకున్న డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో మాత్రం పట్టు
నిలుపుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మిగిలిన రెండేళ్ల పాలనలో బైడెన్‌కు ప్రతినిధుల
సభలోని రిపబ్లికన్ల నుంచి పలు అంశాల్లో ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఉన్న డెమొక్రటిక్ పార్టీకి చెందిన నాన్సీ
పెలోసీ స్థానంలో రిపబ్లికన్ సభ్యుడు కెవిన్ మెక్‌కార్తీ స్పీకర్‌గా
ఎన్నికయ్యారు. 2010 నుంచి 2018 వరకు ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ
మెజార్టీలో ఉంది. గత నాలుగేళ్లుగా డెమొక్రాట్లు ఆధిపత్యం చెలాయించగా మరోసారి
ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు పైచేయి సాధించారు. విధానపరమైన నిర్ణయాల్లో
బైడెన్‌కు ప్రతినిధుల సభ నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.రుణ పరిమితి
పెంపు, ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయడం వంటి విషయాల్లో బైడెన్ నిర్ణయాలకు
ప్రతినిధుల సభలో ప్రతిష్ఠంభన ఎదురయ్యే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్ నుంచి
అమెరికా మిలటరీ ఉపసంహరణ, కొవిడ్ కాలంలో ప్రభుత్వ చర్యలు, బైడెన్ కుమారుడు
హంటర్ వ్యాపార కార్యకలాపాలపై విచారణకు ప్రతినిధుల సభ ఆదేశించే అవకాశం ఉంటుంది.
2024 అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు
మెజార్టీ సాధించడం గమనార్హం.