గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో పెను విషాదం జరిగింది. ఓ
అపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులంతా బర్త్ డే వేడుకలో ఉండగా.. భారీ
అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. అందులో ఒకే
కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో
పెను విషాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులంతా బర్త్ డే వేడుకల
సందడిలో ఉండగా.. ఆ క్షణంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి ఓ కుటుంబమే
బలైపోయింది. అపార్ట్మెట్లో పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 21మంది
బలైపోగా వీరిలో 17మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటం అందరినీ హృదయాలను
కలిచివేస్తోంది.
జబాలియా శరణార్థుల శిబిరం ప్రాంతంలో గురువారం రాత్రి ఓ మూడంతస్తుల భవనంలోని
పైఅంతస్తులో అగ్నిప్రమాదం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
అయితే, ఇంట్లో నిల్వ చేసిన పెట్రోల్ వల్లే ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని
భావిస్తున్నారు. అయితే, ఈ పెట్రోల్ ఎలా మండిందనే అంశంపై మాత్రం స్పష్టత
లేదని, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.రెండు వేడుకలు ఒకేచోట.. అంతా
ఆనందం.. అంతలోనే విషాదం.. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం
కారణంగా గాజా ప్రాంతం నిత్యం బాంబు మోతతో దద్దరిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ
వివాదం కారణంగా చెలరేగిన హింస కాకుండా గత కొన్నేళ్లలో అత్యంత ఘోరమైన సంఘటన
ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. అబు రాయ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తున్న
ఈ భవనంలోని పైఅంతస్తులో చెలరేగిన మంటలు అపార్ట్మెంట్ను పూర్తిగా ధ్వంసం
చేశాయని తెలిపారు. ఈ ఘటనపై అబూ రయా కుటుంబానికి చెందిన మరో వ్యక్తి మహ్మద్
అబూరయా మాట్లాడారు.
ఆ పెద్ద కుటుంబంలో ఒక చిన్నారి పుట్టిన రోజు వేడుకలతో పాటు ఈజిప్టు పర్యటన
నుంచి ఒకరురావడంతో రెండు వేడుకలు ఒకేసారి నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ మంతా
ఒకేచోట చేరి ఆనందంగా గడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని నాశనం
చేసిందని వాపోయారు. బంధువుల రోదనలు మిన్నంటడంతో పాటు ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో
మునిగిపోయింది. వీరి మృతదేహాలను ఉత్తర గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రిలో
ఉంచినట్టు పేర్కొన్నారు.ఏం జరిగిందో చెప్పేందుకు ఎవరూ మిగల్లేదు..
ఇంట్లో పెట్రోల్ నిల్వ చేయడం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తల్ని
కొట్టిపారేసిన మహ్మద్ అబూరయా ఫర్నిచర్ ఎక్కువగా ఉండటం వల్లే మంటలు తీవ్రత
అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విపత్తు ఎలా జరిగిందో వాస్తవాలు చెప్పేందుకు
ఎవరూ సజీవంగా మిగల్లేదని వాపోయారు. ఇది పెట్రోల్ నిల్వ చేయడం వల్ల జరిగిందని
తాను అనుకోవడంలేదని తెలిపారు.