59వ డివిజన్ 243 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ
రాజ్యం నడుస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు అన్నారు. 59 వ డివిజన్ 243 వ వార్డు సచివాలయ పరిధి లూనా
సెంటర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం సందడి వాతావరణంలో
సాగింది. జోరు వర్షంలోనూ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.
ఎమ్మెల్సీ ఎండి రుహల్లా, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక
కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాలతో కలిసి 300 గడపలను ఎమ్మెల్యే
సందర్శించారు. తొలుత స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు
నిర్వహించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి
హామీని తమ ప్రభుత్వం నెరవేర్చినట్లు మల్లాది విష్ణు తెలిపారు. పార్టీలకు
అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా
స్థానిక సమస్యలపై ఆరా తీశారు. కూలిన, పగుళ్లిచ్చిన సైడ్ డ్రెయిన్ల పున:
నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
శానిటేషన్ సిబ్బంది రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ప్రతి ఇంటి వద్ద
పుస్తకం ఏర్పాటు చేసి అందులో శానిటేషన్, మలేరియా సిబ్బంది రోజూ హాజరు నమోదు
చేసుకోవాలని తెలిపారు. అలాగే పేదలందరికీ ఇళ్ల పథకం తొలిదశ నిర్మాణాలకు
సంబంధించి లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని పీఓయూసిడి విభాగానికి
సూచించారు.
ఇంటి వద్దకే రేషన్ దేశానికే ఆదర్శం
దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రేషన్ సరుకులు డోర్ డెలివరీ
విధానం ద్వారా ప్రజల గుమ్మం వద్దకు పంపిణీ చేస్తున్నట్లు మల్లాది విష్ణు
తెలిపారు. పర్యటనలో భాగంగా రేషన్ పంపిణీ వ్యవస్థను ఆయన పరిశీలించారు.
రాష్ట్రంలో బీపీఎల్ కు దిగువున కోటి 54 లక్షల కుటుంబాలు ఉంటే.. 89 లక్షల
కార్డుదారులకు మాత్రమే కేంద్రం బియ్యం కేటాయిస్తోందని మల్లాది విష్ణు అన్నారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 56 లక్షల కార్డుదారులకు బియ్యం అందిస్తున్నట్లు
వెల్లడించారు. ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదనే ఆలోచనతో ప్రతి ఏడాది రూ. 3వేల
కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్
నియోజకవర్గంలో 77,069 తెల్ల రేషన్ కార్డుదారులు ఉండగా.. గడిచిన మూడేళ్లలో
7,112 మందికి కొత్తగా కార్డులు జారీ చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ
కుటుంబాలకు ప్రతినెలా క్రమంతప్పకుండా 52 రేషన్ వాహనాల ద్వారా రాష్ట్ర
ప్రభుత్వం ఇంటి గుమ్మం వద్దకే సరుకులు అందజేస్తున్నట్లు వివరించారు.
అంతేకాకుండా కోవిద్ కష్టకాలంలో నియోజకవర్గంలోని కార్డుదారులకు ప్రతినెలా 616.5
మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా ఇంటి వద్దకు సరఫరా చేయడమే కాకుండా.. 6
నెలల పాటు కందిపప్పు, శనగలను ఒక్కో నెల ఉచితంగా జగనన్న ప్రభుత్వం అందించినట్లు
తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
2024 లో మరోసారి చరిత్రను తిరగరాయడం ఖాయం
సొంత కొడుకుని గెలిపించుకోలేని చంద్రబాబును చూసి వైఎస్సార్ సీపీ భయపడుతోందని
యనమల మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది
విష్ణు అన్నారు. అధికారంలో ఉండి కేబినెట్ సహచరులను కూడా చంద్రబాబు
గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో అవినీతి, అక్రమాలు,
దౌర్జన్యాలు, దుర్మార్గాలు తప్ప ఏనాడూ పేదల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన
పోలేదన్నారు. కనుకనే 2019 సార్వత్రిక ఎన్నికలు సహా స్థానిక సంస్థలు,
ఉపఎన్నికలలోనూ అన్ని ప్రాంతాల ప్రజలు చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని
పూర్తిగా తిరస్కరించారని గుర్తుచేశారు. అయినా సిగ్గులేకుండా మరలా ఏ ముఖం
పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అక్కచెల్లెమ్మల
పట్ల అచెంచలమైన విశ్వాసం, అపారమైన గౌరవంతో నామినేటెడ్ పదవులు, పనుల్లో
50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం తెచ్చిన ఘనత సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు తెలిపారు. టీడీపీలో మహిళలకు ఏ
పాటి గౌరవం ఇస్తున్నారో, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మహిళా నేతలను అడిగితే
చెబుతారన్నారు. కనుక మాటామంతి పేరిట చేస్తున్న ఏడుపే ఏడుపు సెకండ్ వర్షన్
డ్రామాలను కట్టిపెట్టాలని సూచించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన 2024 లో మరోసారి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రను తిరగరాయడం ఖాయమని, 175 స్థానాలలో
వైఎస్సార్ సీపీ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు.
ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ ప్రతిఒక్క డివిజన్ పైన పూర్తి అవగాహన
కలిగిన నాయకుడు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఎన్నో అపరిష్కృత సమస్యలకు
మూడేళ్లలో పరిష్కారం లభించిందన్నారు. మాటల ప్రభుత్వానికి, చేతల ప్రభుత్వానికి
మధ్యగల వ్యత్యాసాన్ని గమనించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. నగర డిప్యూటీ
మేయర్ అవుతు శైలజారెడ్డి మాట్లాడుతూ సొంత నియోజకవర్గం నుంచి వెళ్లగొడితే
ఏం చేయాలో దిక్కుతోచక ఊరూరా వెళ్లి కొత్త డ్రామాలకు వంగలపూడి అనిత
తెరదీస్తున్నారని మండిపడ్డారు. స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా
మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పట్ల
మహిళలందరూ నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అంబేద్కర్, డీఈ రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్,
ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, చింతా
చిన్నా, సురేష్, నేరెళ్ల శివ, అమిత్, గల్లెపోగు రాజు, బండారు దుర్గారావు,
పున్నారావు, ఎన్.దాసు, మేడేపల్లి ఝాన్సీరాణి, సచివాలయ సిబ్బంది, పార్టీ
శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.