దుబ్బాక బస్టాండ్ ప్రారంభానికి ఏర్పాట్లు
వ్యవసాయ రుణాలు పునరుద్ధరించాలి
సిద్దిపేట కలెక్టరేట్లో రైల్వే, ఇతర శాఖల అధికారులతో సమీక్ష
సిద్దిపేట : వచ్చే ఏడాది మార్చి లక్ష్యంగా సిద్దిపేటలో రైలు కూత వినిపించాలని,
పనులు వేగంగా సాగాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వచ్చే జనవరిలో గజ్వేల్
మీదుగా దుద్దెడకు రైలు రానుందన్నారు. దుద్దెడ-సిద్దిపేట మధ్య రైల్వేలైన్ పనుల
పురోభివృద్ధిపై సిద్దిపేట కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్
పాటిల్, అదనపు పాలనాధికారులు ముజమ్మిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, రైల్వే,
ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 100 శాతం
మేర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రైల్వే శాఖకు భూమికి అప్పగించినట్లు తెలిపారు.
నిర్వాసితులకు సొమ్ము చెల్లింపులు చేయడం సహా నిర్మాణంలో మూడో వంతు సహకారం
అందించినట్లు చెప్పారు. రైల్వే అధికారులు, తహసీల్దార్లు సమ్వయంతో పని చేయాలని,
సమస్యలుంటే స్థానిక ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని సూచించారు. జిల్లా
సరిహద్దు పరిధిలో 80 ఎకరాల భూసేకరణ ప్రక్రియ చివరి దశలో ఉందని ఆర్డీవో
అనంతరెడ్డి వివరించారు. డిసెంబరులోపే కుకునూరుపల్లి వరకు రైలు రానుందని రైల్వే
అధికారి జనార్దన్ పేర్కొన్నారు. సుడా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, క్లినికల్
ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు సాయిరాం తదితరులు
ఉన్నారు.
వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం
మెదక్-ఎల్కతుర్తి, జనగామ-సిరిసిల్ల జాతీయ రహదారుల పనులు వేగంగా చేపట్టాలని
మంత్రి ఆదేశించారు. ఎన్హెచ్ఏఐ డీఈ మోహన్, ఆర్డీవోలు అనంతరెడ్డి,
విజయేందర్‌రెడ్డి, ర.భ., ఇతర శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు.
మెదక్-ఎల్కతుర్తి మార్గంలో అటవీ శాఖ అభ్యంతరాలు వారం రోజుల్లో
పరిష్కరించాలన్నారు. 12 చోట్ల నీటి పారుదల శాఖ కాల్వల క్రాసింగ్‌లు వస్తున్న
నేపథ్యంలో సంయుక్తంగా అధికారులు పరిశీలించాలన్నారు. చేర్యాల నుంచి దుద్దెడ
వరకు రోడ్డు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
వ్యవసాయ రుణాలు పునరుద్ధరించాలి
రైతులు రుణ విముక్తి పొందేందుకు వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)
సువర్ణావకాశమని, సద్వినియోగం చేసుకోవాలాని మంత్రి కోరారు. కలెక్టరేట్లో
బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వ్యవసాయ రుణాలను అన్ని
బ్యాంకులు తప్పనిసరిగా పునరుద్ధరణ చేయాలని సూచించారు. ముంపునకు గురైన రైతుల
భూములకు సంబంధించి రుణాల విషయంలో బ్యాంకులు ప్రత్యేక పథకాలు
రూపొందించాలన్నారు. ఓటీఎస్ కింద 12 శాతం నుంచి 50 శాతం వరకు మొండి బకాయిలు
ఉండి పంట రుణాలు తిరిగి కట్టని వారికి ఆ వెసులుబాటు వర్తించనుందన్నారు. జడ్పీ
అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్
ప్రతాప్‌రెడ్డి, ఎల్డీఎం సత్యజిత్, ఆర్బీఐ ఏజీఎం శివరామన్, నాబార్డు
డీడీఎం తేజన్, వివిధ బ్యాంకుల అధికారులు ఉన్నారు.
రెండు గ్రామాల్లో ఏపీజీవీబీ శాఖలు
గజ్వేల్ మండలం అహ్మదీపూర్, జగదేవపూర్ మండలం తీగుల్‌లో ఏపీజీబీవీ శాఖలు
ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌కు మార్చారు. ఈ
రెండు గ్రామాల్లో 5 వేల జనాభా కలిగి ఉన్న దృష్ట్యా తిరిగి ఆయా చోట్ల ఏర్పాటు
చేయాలని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు శాఖలు
పునరుద్ధరించాలని ఏపీజీవీబీ ఆర్ఎం ఆశాలతను మంత్రి ఆదేశించారు.
దుబ్బాక బస్టాండ్ ప్రారంభానికి ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరగా
లబ్ధిదారులకు అందించాలన్నారు. దుబ్బాక బస్టాండ్ ప్రారంభానికి ఏర్పాట్లు
చేయాలన్నారు. సిద్దిపేటలో ఆయుష్ ఆసుపత్రి, సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నిర్మాణం
వెంటనే ప్రారంభించాలని, నర్సింగ్ హాస్టల్ పనుల్లో వేగం పెంచాలన్నారు.
మిట్టపల్లిలో మహిళా సమాఖ్య భవనం, ప్రాంగణం, వృద్ధాశ్రమం నిర్మాణానికి చర్యలు
తీసుకోవాలన్నారు. రంగధాంపల్లిలో త్రీటౌన్ పోలీసు ఠాణా నిర్మాణానికి, కేంద్రీయ
విద్యాలయానికి స్థల ఎంపిక పూర్తి చేయాలని స్పష్టం చేశారు.