కరోనా వైరస్ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి
రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో, చైనాలో
మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా చైనాలో బుధవారం ఒక్కరోజే 31,454 కేసులు నమోదయ్యాయి. వీటిలో 27,517
కేసులు అసింప్టొమేటిక్ అని చైనా నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. ఇదే
సమయంలో 5వేల మరణాలు కూడా నమోదు అయినట్టు సమాచారం. కాగా పాజిటివ్ కేసులు
పెరుగుతున్న తరుణంలో కరోనా సోకిన నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
ఆఫీసులు, రెస్టారెంట్లను అధికారులు మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని
ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, ఏదైనా నగరంలో చిన్న ఔట్ బ్రేక్ వచ్చినా
ఆ నగరం మొత్తాన్ని అధికారులు షట్ డౌన్ చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ సంఖ్యలో
కరోనా పరీక్షలు, ప్రయాణ పరిమితులు, లాక్ డౌన్ విధించి కరోనా వ్యాప్తిని
అరికట్టేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక, ప్రభుత్వం
అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు. పలు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు బయటకు రాకుండా ఉండేందుకు
చర్యలు తీసుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేక క్వారంటైన్ గదులను సైతం ఏర్పాటు
చేస్తున్నారు.