అమెరికా : అమెరికా వీసాల విషయంలో ఇతర దేశాల మాదిరిగానే భారతీయ పౌరులకూ
నిబంధనలు ఉన్నాయని శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ
నాగేంద్ర ప్రసాద్ అన్నారు. భారతీయ పౌరుడైనా, విదేశీయులైనా ఆయా నియమ,
నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా
రాష్ట్రం లాస్ఆల్టోస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ
సందర్భంగా అమెరికాలోని ప్రవాస భారతీయులు, అగ్రరాజ్యానికి వెళ్లాలనుకునేవారు
ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నాగేంద్ర ప్రసాద్ స్పందించారు. అర్హత ఉన్నవారు
ఓసీఐ తీసుకోవాలని, ఇతర సేవల కోసం ఆన్లైన్ అపాయింట్మెంట్ పొందాలని
వివరించారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పీసీఆర్ పరీక్షలను రద్దు
చేసినట్లు తెలిపారు. వివిధ కమ్యూనిటీ సంస్థలు, సీఈవోలు, పెట్టుబడిదారులు,
విద్యార్థులు, స్టార్టప్ కమ్యూనిటీ, సాంస్కృతిక సంస్థలకు సంబంధించిన సమస్యలపై
అనేక విషయాలను నాగేంద్ర ప్రసాద్ వివరించారు.
అమృత్ మహోత్సవాల కాలంలో మీడియా పాత్ర అనే అంశంపైనా మాట్లాడారు. మీడియాలో
వచ్చే తప్పుడు కథనాలు ఎదుర్కోవడంపై తన అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. అమెరికా
నుంచి భారత్‌కు అందుతున్న సహకారం.. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా
రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడుల అంశాలను వివరించారు. ఇటీవల కాలంలో భారత్‌కు
చెందిన పలువురు కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి,
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మంత్రులు
అమెరికాలో నిర్వహించిన పర్యటనలను ఈ సందర్భంగా నాగేంద్ర ప్రసాద్
ప్రస్తావించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 21 వరకు అందించిన
సేవలను ఆయన వివరించారు. పాస్‌పోర్టులు 38,355, ఓసీఐ 90,470, వీసా 13,027,
రినన్సియేషన్ 18,413, మిసిలేనియస్ 10,548 అని చెప్పారు. మొత్తం 1,70,813
సేవలను అందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాన్సుల్ డాక్టర్ అకున్
సభర్వాల్, కాన్సులేట్ సిబ్బంది పాల్గొన్నారు.