ఘనంగా 73వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
అంబేత్కర్ కు నివాళి అర్పించిన గవర్నర్ , సిఎం
విజయవాడ : సమాజంలో సామరస్యతను నెలకొల్పేందుకు రాజ్యాంగ నిర్మాతలు చేసిన కృషిని
ప్రజలు ఎప్పటికీ మరువజాలరని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అన్నారు. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన 73వ రాజ్యాంగ దినోత్సవ
వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి డాక్టర్ బిఆర్
అంబేత్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ
వ్యవస్థాపక పితామహులు అంబేద్కర్ విరచిత రాజ్యాంగ ప్రవేశికను గవర్నర్ చదివి
వినిపిస్తూ, ఆహుతులతో పునరావృతం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్
మాట్లాడుతూ వేదకాలం నుంచి భరతగడ్డపై ప్రజాస్వామ్య భావన ప్రబలంగా ఉందన్న
భావనను చాటిచెప్పేందుకు ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని భారత్: లోకతంత్రకీ
జననీ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాచీన వేద కాలం నుండి
భారతీయులు సమానత్వ స్ఫూర్తితో, లోక్ తాంత్రిక పరంపరను కలిగి ఉన్నారన్నారు. తన
భిన్నత్వంతో భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన ప్రజాస్వామ్య
దేశంగా ఉందన్నారు. వ్యక్తి ప్రవర్తనను నియంత్రించే మతపరమైన వ్యవస్ధ నైతిక
చట్టం, ధర్మం, వేదాల నుండి ఉద్భవించిందని, ఇది భారతీయ సమాజానికి అనాదిగా ఉన్న
భావన అని గవర్నర్ పేర్కొన్నారు. పౌరుల హక్కులను పరిరక్షించడం ద్వారా రాజ్యాంగం
వారికి అధికారం ఇస్తుందని, పౌరులు తమ విధులకు కట్టుబడి రాజ్యాంగానికి సాధికారత
కల్పించారన్నారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు అణచివేయబడిన
ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులను గవర్నర్ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర
మోదీ నేతృత్వంలో ప్రపంచ వేదికపై భారతదేశం నిర్వహించిన గొప్ప పాత్రను
గవర్నర్ ప్రస్తావించారు, సంయమనం, చర్చలతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య
యుద్ధాన్ని ముగించేందుకు ప్రధాని చూపిన చొరవని కొనియాడారు. తొలుత
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ భారత రాజ్యాంగం ప్రజలలో
క్రమశిక్షణను సూచించే రూల్ బుక్ వంటిదన్నారు. రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల
సామాజిక న్యాయ చరిత్రను తిరగరాసిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు
న్యాయమూర్తులు, అమాత్యులు, ప్రజాప్రతినిధులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సమీర్ శర్మ, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, డిజిపి
రాజేంద్రనాధ్ రెడ్డి జిఎడి కార్యదర్శి ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.