వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : పారిశ్రామిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా
నిలుస్తోందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి
రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు
వెల్లడించారు. దేశంలో అత్యధిక ఎగుమతి, దిగుమతులు నిర్వహించే 10 పోర్టులు ఉన్న
రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర ప్రాంత అభివృద్ధి, పోర్టుల నిర్మాణం పై
ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఈ ఘణత సాధ్యపడిందని అన్నారు.
ఏపీ సీఎం ఎంఎస్ యాప్ తో పట్ణణాల్లో రోడ్డు సమస్యలకు చెక్
పట్టణాభివృద్ధి శాఖ కు సంబంధించి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో
నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టిందని
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పారదర్శకతకు, సాంకేతికతకు పెద్దపీట వేసే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందుకోసం ‘ఏపీ సీఎం ఎంఎస్’ (ఏపీ కన్సిస్టెంట్
మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక యాప్ ను రూపొందిస్తోందని
అన్నారు. ఈ యాప్ ద్వారా నగరాలు, పట్టణాల్లో రోడ్డు సంబంధిత సమస్యలపై ప్రజలు
ఫొటో తీసి అప్లోడ్ చేయగానే నిర్దిష్ట వ్యవధిలోగా మరమ్మతులు పూర్తి చేసేలా
చర్యలు తీసుకుంటుందని అన్నారు. నెల రోజుల్లో ఏపీ సీఎం ఎంఎస్ యాప్ అందుబాటులోకి
రానుందని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా భారత రాజ్యాంగ సృష్టికర్త
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు శనివారం నాడు దేశ ప్రజలందరూ గుర్తు
చేసుకున్నారని, ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారని తెలిపారు. ఈ సందర్బంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు లో భాగంగా కోనసీమ జిల్లాకు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మహనీయునిపై
ఉన్న గౌరవాన్ని చాటిచెప్పిందని గుర్తుచేశారు. ఆయన ఆశయాలు సాధనకు ప్రజలంతా
కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా చిన్నపిల్లల్లో రోజురోజుకీ
పెరుగుతున్న మీజిల్స్ వ్యాధి కేసులు ఆందోళన కలిగించే అంశమని విజయసాయి రెడ్డి
అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు
వైద్య నిపుణులతో టీంలు, కమాండ్ ‘సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. మీజిల్స్
చికిత్సకు సంబంధించి సాధ్యమైన ప్రతి సహకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు
అందించాలని కోరారు.