హైదరాబాద్ : శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో ఉపగ్రహాల ప్రయోగం
విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశ అంకుర
సంస్థల చరిత్రంలో ఇదో శుభదినమన్నారు. ‘ధృవ’ స్పేస్ టెక్ ప్రైవేటు సంస్థ
ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో ఉపగ్రహాల ప్రయోగం
విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన
పీఎస్ఎల్వీసీ-54తోపాటు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ధృవ’ సంస్థ
పంపిన ‘తై బోల్ట్ 1, తై బోల్ట్ 2’ ఉపగ్రహాలు వాటి కక్ష్యల్లోకి చేరడం దేశ
అంకుర సంస్థల చరిత్రలో ఓ శుభ దినమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
ప్రారంభించిన టీహబ్‌లో సభ్య సంస్థ ‘ స్కైరూట్’ ఇటీవల ప్రయోగించిన విక్రమ్-ఎస్
ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ
స్టార్టప్ మొట్ట మొదటి సంస్థగా చరిత్ర లిఖించిందన్నారు. తాజా ప్రయోగాలతో
అంకుర సంస్థల నగరంగా పేరొందిన హైదరాబాద్ విశిష్టత మరింత పెరిగిందన్నారు.
ఔత్సాహికుల ప్రతిభను వెలికితీయడం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సమాచార
రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టీహబ్లు భవిష్యత్తులో
మరెన్నో మైలురాళ్లు సాధిస్తాయనే నమ్మకం తనకుందని, ఇది ఆరంభం మాత్రమేనని సీఎం
అన్నారు. తెలంగాణ కీర్తిని చాటిన ‘స్కైరూట్’ మరియు ‘ధృవ’ స్పేస్ స్టార్టప్
సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో
తెలంగాణ యువత భారతదేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రతిభను
ప్రపంచానికి చాటుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ యువకులకు తెలంగాణ
ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. శాస్త్ర సాంకేతిక, ఐటీ రంగాల్లో
ఔత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న మంత్రి
కేటీఆర్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.