హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఎదుర్కొని తెలంగాణపై మళ్లీ
గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయి
నుంచి బలమైన నాయకత్వానికి పునాదులు వేస్తోంది. జిల్లాల వారీగా పార్టీ
కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ
హైదరాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రులు తలసాని
శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ భేటీ అయ్యారు. హైదరాబాద్లో పార్టీ
కార్యకలాపాలపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల నగరంలోని టీఆర్ఎస్
ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమైన మంత్రి తలసాని శ్రీనివాస్
యాదవ్ పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇవాళ
మరోసారి తెలంగాణ భవన్లో మంత్రులు తలసాని, మహమూద్ అలీ హైదరాబాద్ జిల్లా
నేతలతో భేటీ అయ్యారు.
గులాబీ పార్టీని పటిష్ఠం చేయడంతోపాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి
తీసుకెళ్లే విధానంపై నేతలతో మంత్రులు చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వన
భోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య సమావేశాలు నిర్వహించాలని నేతలు
నిర్ణయించారు. రాబోయే ఎన్నికలు కీలకమైనవి అని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
అభిప్రాయపడగా.. ఐటీ, ఈడీ దాడులకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
యువతకు పార్టీలో ప్రాధాన్యమివ్వాలని… తలసాని సాయికుమార్ అభిప్రాయం
వ్యక్తపరిచారు. కీలక సమావేశం జరుగుతుండగా… పార్టీ నిర్ణయాలను అమలు కోసం
చేయాల్సిన ఏర్పాట్లపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు.డిసెంబర్ 9న మెట్రో రెండో
దశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి
గోపీనాథ్ తెలిపారు. స్థానిక సమస్యలు గుర్తించి, పరిష్కార మార్గాలపై
దృష్టిసారించాలని కార్యకర్తలకు సూచించారు. బూత్ కమిటీల నియామకం చేపట్టి.. ఓటర్
నమోదుపై దృష్టి సారించాలని అన్నారు. బీజేపీ ఆరోపణలపై దీటుగా స్పందించి సమాధానం
చెప్పాలని హైదరాబాద్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈడీ, ఐటీ కేసులతో బీజేపీ
నేతలు భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు చాలా
కీలకమైనవని, ముఖ్యమైనవని.. నాయకులంతా సమన్వయంతో పని చేయాలనే నిర్ణయానికి
వచ్చారు. వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలు డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు
చేయాలని తీర్మానించారు. యువతను ప్రోత్సహించి.. యువతకు, ఉద్యమకారులకు
ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.