వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి విజయసాయిరెడ్డి
విజయవాడ : ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన ఇంత సజావుగా, జనరంజకంగా,
రాజ్యాంగబద్ధంగా సాగుతుండగా అరాజక పాలన సాగుతోందని ప్రతిపక్ష నాయకుడు తన
బహిరంగ లేఖలో ఆరోపించడం అఖిలాంధ్ర ప్రజానీకాన్ని అవమానించడమేనాని వైఎస్ఆర్
సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మెరకు సోషల్
మీడియా వేదికగా ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం
సందర్భంగా ప్రజలకు బహిరంగ లేఖ రాసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు
నిజానికి వారికి ఇప్పుడు ఆలస్యంగానైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రిగా తన చివరి హయాంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ను కొత్త పునాదులతో
బలోపేతం చేయాల్సిన కుప్పం ప్రతినిధి తన ఏకపక్ష నిర్ణయాలతో ఐదేళ్లూ
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని చెప్పారు. పారదర్శక పాలనకు
తిలోదకాలిచ్చారు.
విభజనతో బక్కచిక్కిన ఏపీని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలహీనంచేసి పోయారని
అన్నారు. అధికారం ఇచ్చిన నేలకు ఇంత అన్యాయం చేసిన మాజీ సీఎం తన బహిరంగ లేఖలో
భారీ అబద్ధాలాడడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో సాగుతున్నది
‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం’ అని ఆయన ఈ లేఖలో ఆరోపించడం దయ్యాలు వేదాలు
వల్లిస్తున్నట్టుందని చెప్పారు. ఉగ్రవాదం అంటే ప్రభుత్వ, రాజ్య వ్యతిరేక
శక్తులు ప్రజలందరినీ భయోత్పాతానికి గురిచేసే చర్యలకు పాల్పడడమని చదువుకున్నాం.
అయితే, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదీ ఉగ్రవాదానికి ఊతం ఇవ్వదని ‘గ్లోబల్
లెవెల్లో’ పేరుమోసిన నారా వారికి తెలియదా? అని ప్రశ్నించారు. ఒక పక్క
రాష్ట్రంలో ఆటవిక, అరాజక పాలన సాగుతోందని అభాండాలు వేస్తూనే, మరో పక్క
న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో ప్రభుత్వాన్ని తప్పుపట్టే స్థితిలో ఉన్నాయని
చంద్రబాబు గారు చెప్పడం ఆయన పరస్పర విరుద్ధ వాదనలకు దర్పణం పడుతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కనుక రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలు
సాగితే అన్ని వ్యవస్థలూ కూలిపోతాయనీ, కోర్టులు పాలకపక్ష వ్యతిరేక తీర్పులు
ఇవ్వడం సాధ్యం కాదనే విషయం సాధారణ పౌరులందరికీ తెలుసాన్నారు. కాని నాలుగు
దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఈ వృద్ధ నేత అన్నీ తెలిసి కూడా రాజ్యాంగం
సాక్షిగా ప్రజలకు అబద్ధాలను లేఖలో రాసి చెప్పడం దారుణమని చెప్పారు. తాను
సీఎంగా ఉన్న 2014–19 మధ్య కాలంలో కొత్త రాజధాని ఏర్పాటుకు స్థల నిర్ణయం నుంచి
అనేక సాధారణ విషయాల్లో ప్రధాన ప్రతిపక్షంతో సంప్రదించినది లేదని గుర్తు
చేశారు. బహుళపక్ష పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షానికి కూడా
ప్రధాన పాత్ర ఉంటుందనే విషయం కావాలని ఆయన విస్మరించారు.
గత మూడున్నరేళ్లు అందరితో చర్చించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి
నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేగాక, వాటిని అమలు పరుస్తోంది.
ఒకవేళ అభ్యంతరకరమైనవని భావించిన నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపడుతున్న
సందర్భాలనూ చూస్తున్నాం. ప్రభుత్వం న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా తన
కార్యక్రమాలు, చర్యలను తగిన విధంగా సవరించుకున్న సందర్భాలూ ఉన్నాయి. పాలన ఇంత
సజావుగా, జనరంజకంగా, రాజ్యాంగబద్ధంగా సాగుతుండగా రాష్ట్రంలో అరాజక పాలన
సాగుతోందని ప్రతిపక్ష నాయకుడు తన బహిరంగ లేఖలో ఆరోపించడం అఖిలాంధ్ర
ప్రజానీకాన్ని అవమానించడమే. ఎన్నికలు ఏడాదిన్నరో వస్తున్నాయ్. ఇప్పుడైనా
పద్ధతిగా ఉంటే ప్రతిపక్షానికి అసెంబ్లీలో అతి స్వల్ప ప్రాతినిధ్యమైనా
దక్కుతుందని ‘ఒరిజినల్ చంద్రగిరి చంద్రయ్య’ గ్రహిస్తే ప్రజలు సంతోషిస్తారని
విజయసాయిరెడ్డి అన్నారు.