1990లలో కశ్మీర్ లోయలో కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాల ఆధారంగా తెరకెక్కిన
చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రంపై ఐఎఫ్ఎఫ్ఐ ఛైర్ పర్సన్, ఇజ్రాయెల్
చెందిన ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత నడవ్ లపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నవంబర్ 20 నుండి నవంబర్ 28 వరకు గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్
ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్
ఫైల్స్’ని ప్రదర్శించారు. ఈవెంట్ ముగింపు వేడుకలో జ్యూరీ చైర్పర్సన్ నడవ్
లాపిడ్ మాట్లాడుతూ ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఆ కార్యక్రమంలో నడవ్
మాట్లాడుతూ.. ‘ఈ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి.
కానీ 15వ సినిమా కశ్మీర్ ఫైల్స్ నచ్చలేదు. ఆ సినిమాని చూసి అందరం చాలా
డిస్టర్బ్ అయ్యాం. దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది కళాత్మక పోటీకి తగని అసభ్య
చిత్రంగా మాకు అనిపించింది. ఇటువంటి ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో అలాంటి
వల్గర్ చిత్రాన్ని ఎందుకు ప్రదర్శించారో అర్థం కాలేదు. ఆత్మ విమర్శను ఇక్కడ
తీసుకోగలరు కాబట్టి ఇంత బహిరంగంగా అందరి ముందు మాట్లాడుతున్నా’ అని
చెప్పుకొచ్చాడు.