విజయవాడ : జగనన్న విద్యాదీవెన పథకం జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులు రూ.694
కోట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో
జమ చేశారని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి
అన్నారు. పలు అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగా బుధవారం స్పందించారు. పిల్లల
చదువే ఆస్తిగా భావించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి
దీవెన కింద ఇప్పటివరకు మొత్తం రూ.12,401 కోట్లు అందించారని వెల్లడించారు.
ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న
విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును ఈ ప్రభుత్వం అమలు
చేస్తోందని చెప్పారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల
కొరతకు తావివ్వకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఇందులో
భాగంగా ఇప్పటికే 46 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు. ఈ
క్రమంలోనే తాజాగా 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్య, ఆరోగ్య
శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన వెల్లడించారు.