దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఇప్పటికే వైద్య శాఖలో 46 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి: బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
తెలియజేసింది. ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి
వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు జోన్ల వారీగా ఈ
పోస్టులను భర్తీ చేయనున్నారు. బుధవారం నుంచి డిసెంబర్ 5 వరకు
cfw.ap.nic.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి.
అభ్యర్థులు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ఐదు
గంటలలోగా వైద్య, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో సమర్పించాల్సి
ఉంటుంది. జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 42 ఏళ్ల లోపు వయసున్న
అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు
ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్మెన్లకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల
పాటు వయోపరిమితి నుంచి సడలింపు ఉంటుంది.
ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, బీసీ,
దివ్యాంగులకు రూ.300గా నిర్దేశించారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక
ఉంటుందని వైద్య శాఖ తెలిపింది. కోవిడ్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ తదితర
ఇతర వెయిటేజ్‌లు వర్తిస్తాయని పేర్కొంది. భవిష్యత్‌లో ఖాళీ అయ్యే నర్సింగ్
పోస్టుల భర్తీకి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్‌ను వచ్చే ఏడాది
ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు
తావివ్వకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా 2019 నుంచి 46 వేలకు పైగా పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టిన
సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంట్రాక్ట్ పద్ధతిలో 461 స్టాఫ్ నర్సు
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.