వైఎస్సార్ జిల్లా నుంచి పదిమంది పరిశీలకులు
కడప: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ వ్యూహాలకు పదును పెడుంతోంది. ఈ మేరకు ఏడాదిన్నర ముందే రాష్ట్రంలోని 175
నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో
అనుభవం ఉన్నవారిని ఎంపిక చేసి ఈ పదవుల్లో నియమించారు. గతంలో ఏ జిల్లాకు
సంబంధించిన నాయకులు ఆ జిల్లాకే పరిశీలకులుగా నియమించగా ప్రస్తుతం పొరుగు
జిల్లాల వారిని నియమించారు. వైఎస్సార్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు
ఏడుగురిని పరిశీలకులుగా నియమించారు. కడప నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే
కొండూరు ప్రభావతమ్మ కుమారుడు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మెన్ అజయ్
కొండూరును, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కదిరి పట్టణానికి చెందిన మాజీ
ఎమ్మెల్యే కడవల మోహన్‌రెడ్డిని, బద్వేల్ నియోజకవర్గానికి ఆళ్లగడ్డకు చెందిన
విజయ పాల డెయిరీ అధినేత ఎస్వీ జగన్మోహన్రెడ్డిని, పులివెందుల
నియోజవర్గానికి రాజంపేట మున్సిపల్ చైర్మన్, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్
పోలా శ్రీనివాసులరెడ్డిని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. అలాగే కమలాపురం
నియోజకవర్గానికి కర్నూలు జిల్లాకు చెందిన జగదీశ్వర్‌రెడ్డిని, జమ్మలమడుగు
నియోజకవర్గానికి కర్నూలు జిల్లాకు చెందిన పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డిని,
మైదుకూరు నియోజకవర్గానికి రాజంపేటకు చెందిన అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల
అధినేత, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చొప్పా యల్లారెడ్డిని
ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. వీరంతా వారికి కేటాయించిన బాధ్యతలను
సమర్థవంతంగా నిర్వహించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వం
అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక సమస్యల
పరిష్కారం, కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం తదితర వ్యవహారాలను సైతం చక్కబెట్టి
సమష్టిగా అందరూ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పనిచేయనున్నారు.
వైఎస్సార్ జిల్లా నుంచి పదిమంది పరిశీలకులు : ఇతర జిల్లాల నాయకులను
వైఎస్సార్ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమించినట్లే
ఈ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలను ఇతర జిల్లాల్లోని
నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. నంద్యాల జిల్లాలోని
నందికొట్కూరు నియోజకవర్గానికి మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని,
బనగానపల్లె నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి
అఫ్జల్‌ఖాన్‌ను, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ప్రొద్దుటూరుకు చెందిన
వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డిని ఎన్నికల
పరిశీలకులుగా నియమించారు. బద్వేల్‌కు చెందిన అడా చైర్మన్ గురుమోహన్‌ను,
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి, ప్రకాశం జిల్లా గిద్దలూరు
నియోజకవర్గానికి బద్వేలుకు చెందిన బంగారు శ్రీనును పరిశీలకులుగా నియమించారు.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గానికి ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు
చైర్మన్ పులి సునీల్‌కుమార్‌ను, రాయచోటి నియోజకవర్గానికి ఏపీ వేర్‌హౌస్
కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఏ కరిముల్లాను, తంబళ్లపల్లె నియోజకవర్గానికి మాజీ
జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని, తిరుపతి నియోజకవర్గానికి
కమలాపురానికి చెందిన జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ సంబటూరు
ప్రసాద్‌రెడ్డిని, అనంతపురం(అర్బన్) నియోజకవర్గానికి పులివెందులకు చెందిన
యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్‌లను పరిశీలకులుగా నియమించారు.