ఆకట్టుకున్న ఛాయాచిత్ర ప్రదర్శన
విజయవాడ : గతంలో శాసనాలు చరిత్రకు సాక్షాలు అయితే ఇప్పుడు ఫోటోలే సాక్ష్యాలు
అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ మొగల్రాజపురంలోని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి
ఆవరణలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటి అండ్ కల్చరల్ కమిషన్, ఇండియా
ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ (న్యూఢిల్లీ), ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ
సంయుక్త ఆధ్వర్యంలో 130వ వరల్డ్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే వేడుకలు గురువారం
సాయంత్రం ఘనంగా జరిగాయి. గద్దె రామ్మోహన్ అతిధిగా హజరయ్యారు. గతంలో చరిత్ర
తెల్సుకోవాలంటే శిలాశాసనాలపైనే ఆధారపడే వారమన్నారు. శాసనసభ మాజీ ఉపసభాపతి
మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో విజయనగర సామ్రాజ్యం ఎలా ఉండేదనే
విషయంతో పాటుగా దివిసీమ ఉప్పెన, హుద్హూద్ తుపాను భీభత్సాన్ని ఫోటోలు కళ్ళకు
కట్టాయన్నారు. ఛాయా చిత్ర ప్రదర్శనలోనే చిత్రాలు సందర్శకులతో
మాట్లాడాయన్నారు.ఎప్పుడో గడిచిపోయిన క్షణాలను ఎప్పటికి సజీవంగా మన ముందు
ఉంచేవి ఫోటోలేనన్నారు ఆంధ్రప్రదేశ్ మధ్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్
వి.లక్ష్మణరెడ్డి మాట్లాడూతూ 1839 తర్వాత కెమెరా అందుబాటులోకి వచ్చిన తర్వాత
ఫోటోగ్రాఫర్లు ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేసి మంచి చిత్రాలను ప్రజలకు
అందచేస్తున్నారని చెప్పారు. ఫోటోగ్రఫి అకాడమీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి
టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కళాత్మక ఛాయా చిత్రాల్లో భారతీయులే
అగ్రస్థానమన్నారు. ఫోటోగ్రాపర్లల్లోని ప్రతిభను వెలికితీయడానికి తమ అకాడమీ
ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సభకు ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ
కార్యదర్శి గోళ్ళ నారాయణరావు అధ్యక్షత వహించారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్,
కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి్డ్డ పాల్గొన్నారు.
కళాత్మక ఛాయాచిత్ర ప్రదర్శనలో భారతీయులదే అగ్రస్థానం పేరుతో ముద్రించిన
కరపత్రాన్ని అతిధులు ఆవిష్కరించారు. దేశంలోని 8 రాష్ట్రాలకు చెందిన
ఫోటోగ్రాపర్లు తీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.