మధ్యప్రదేశ్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న తరుణంలో శుక్రవారం
కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ మీడియాతో
మాట్లాడుతూ బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాపై విరుచుకుపడ్డారు.
”సింధియా ఓ 24 క్యారెట్ల మోసగాడు.. కేవలం పదవుల కోసం పార్టీని వీడిన పక్కా
మోసగాడు” అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ భాజపా
కార్యదర్శి రజ్నీష్ అగర్వాల్ స్పందించారు. ‘సింధియా, హిమంత్ బిశ్వ శర్మ..
బలమైన సాంస్కృతిక మూలాలు కలిగిన 24 క్యారెట్ల దేశభక్తులు’ అని అన్నారు.
పార్టీని నడిపే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని ఆరోపిస్తూ.. హిమంత్ బిశ్వశర్మ
2015లో హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. అనంతరం కేంద్ర మంత్రిగా,
ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ లో కీలక
నాయకుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా 2020లో కాంగ్రెస్ ను వీడి భాజపాలో
చేరారు. అనంతరం భాజపా అతడికి మంత్రి పదవి ఇచ్చింది. పౌరవిమానశాఖ మంత్రిగా ఆయన
సేవలందించారు.