గుంటూరు : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాల దిశగా అడుగులు
వేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.
సిట్టింగ్ లో ఎంత మందికి సీట్లు దక్కుతాయో, ఎంత మంది ని పక్కన పెడుతారనేది
పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న
ముఖ్యమంత్రి ప్రతీ నియోజకవర్గం విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
అభ్యర్ధుల కంటే పార్టీ ముఖ్యమని ఇప్పటికే సీఎం స్పష్టం చేసారు. దీంతో తాజాగా
ఎమ్మెల్యేల పని తీరు, ప్రజల్లో ఆదరణ ఆధారంగా లిస్టు సిద్దం చేసారు. ఇందులో
కొందరు సీనియర్లు వెనుక వరుసలో ఉన్నారు. దీంతో, ఇప్పుడు వారికి సీఎం ఏం
చెప్పబోతున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.
వైసీపీ సిట్టింగ్ ల్లో సీట్లు దక్కనిదెవరికి
వైసీపీ ఎమ్మెల్యేల్లో సిట్టింగ్ ల్లో తిరిగి సీట్లు దక్కేదెవరికి. సీట్లు
కోల్పోయే ఎమ్మెల్యేలు ఎవరు. ఇప్పుడు ఇదే పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది.
ప్రభుత్వంలో, పార్టీలో కీలక మార్పులు పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు
ఎమ్మెల్యేల పని తీరు ఆధారంగా నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సీఎం
జగన్ సిట్టింగ్ ల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. రెండు నెలల
క్రితం జరిగిన పార్టీ వర్క్ షాపులో సీఎం జగన్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేల పని తీరు
గురించి ప్రస్తావించారు. 27 మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించారు. వారికి
ప్రజలతో సత్సంబంధాల విషయంలో వెనకబడి ఉన్నారని హెచ్చరించారు. గడపగడపకు
ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని నిర్దేశించారు. ఆ 27 మంది
విషయంలో మాత్రమే టిక్కెట్లు ఇస్తారా లేదా అనే చర్చ పార్టీలో ఉంది. కానీ
ఇప్పుడు అనూహ్యంగా కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ 27 మంది గడప గడపకు
ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడి ఉన్నారని.ఎం, వారిలో కొందరి పని తీరు మెరుగు
పడిందని తాజా నివేదికల్లో స్పష్టం అయిందని సమాచారం. కానీ, ఇక్కడే మరో ట్విస్ట్
చోటు చేసుకుంది.
ప్రజా మద్దతు ఆధారంగా మరో జాబితా
ముఖ్యమంత్రి జగన్ పలు మార్గాల్లో, విభిన్న కోణాల్లో ప్రతీ నియోజకవర్గంలో
క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరు, సామాజిక
సమీకరణాలు, ప్రజా మద్దతు, ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులు, ప్రభుత్వం –
సిట్టింగ్ ఎమ్మెల్యేపై సానుకూలత అంశాల ఆధారంగా ఈ సమాచారం సేకరిస్తున్నారు.
అయితే, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు రేటింగ్స్ లో మరో 11 మంది
నిర్దేశిత అంచనాల కంటే వెనుకబడి ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఆశించిన స్థాయిలో
పని చేయని వారి జాబితాలో పశ్చిమ గోదావరి,గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా
నేతల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇద్దరు ప్రస్తుత మంత్రులతో పాటుగా
నలుగురు మాజీ మంత్రులు ఉన్నట్లు సమాచారం. నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి కూడా
ఆ జాబితాలో ఉన్నారు. అయితే, పార్టీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్ అనే విధంగా
ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్న వేళ వీరికి టికెట్ల అంశం పైన సీఎం ఏ
నిర్ణయం తీసుకుంటారనేది చర్చకు కారణమవుతోంది.
చంద్రబాబు నిర్ణయంతో..వైసీపీలో
టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ సిట్టింగ్ లకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు
ప్రకటించారు. అందులో 17 మంది తిరిగి టీడీపీ నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ టికెట్ల విషయంలో మాత్రం ఆచితూచి
వ్యవహరిస్తున్నారు. టీడీపీ సిట్టింగ్ లకే సీట్లు ఖరారు కావటంతో గతంలో ఆ
నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వారు.. ప్రస్తుతం ఆ నియోజవర్గాల్లో
ఇంఛార్జ్ లు గా ఉన్న వారి విషయంలో మాత్రం సానుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న
మంత్రుల్లోనూ ముగ్గురికి సీట్ల కేటాయింపు పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, సీట్లు దక్కని వారికి మరో విధంగా పార్టీలో గుర్తింపు ఇస్తామంటూ
ఇప్పటికే సీఎం సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఆరు నెలల ముందే టికెట్లు
ప్రకటిస్తానని సీఎం స్పష్టం చేసారు. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్లో సీట్లు
దక్కేదెవరికి, సీఎం జగన్ ఎవరిని పక్కన పెట్ట బోతున్నారనేది ఇప్పుడు పార్టీలో
ఆసక్తి నెలకొంది.