కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్
విజయవాడ : రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్
చాలా వైవిధ్యమైన రాష్ట్రంమని, గొప్ప సాంస్కృతిక చరిత్ర, వారసత్వం గురించి
గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ఆంధ్రుల సాంస్కృతిక సంపద పండుగలు, సాహిత్యం,
సంగీతం, నృత్యం, నాటకం, కళలు ప్రజల జీవన విధానాన్ని ప్రతిబిస్తాయన్నారు.
రాష్ట్ర అధికారిక భాషగా తెలుగు ఆరు సాంప్రదాయ భాషలలో ఒకటిగా ఉందని,
ప్రపంచవ్యాప్తంగా 96 మిలియన్లకు పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారన్నారు. నోబెల్
గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ‘భారతీయ భాషలన్నింటిలోకి తెలుగు అత్యంత మధురమైనదని
ప్రస్తుతించారన్నారు. తెలుగు సాహిత్యం, గొప్ప కవులు, సాహిత్య దిగ్గజాల రచనలతో
కాలానుగుణంగా సుసంపన్నమైందన్నారు. రాష్ట్రంలో ఉద్భవించిన ‘కూచిపూడి’ నృత్యం
దేశంలోనే ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నృత్యంమన్న గవర్నర్, ఆంధ్ర ప్రదేశ్ అనేక
వేల సంవత్సరాల నాటి సుసంపన్నమైన సాంస్కృతిక చరిత్ర, సాంప్రదాయ వైభవంతో ప్రపంచ
ప్రసిద్ధి చెందిన దేవాలయాల పుణ్యభూమిగా ఉందన్నారు. పర్యాటకులకు, యాత్రికులకు
అద్భుతమైన అనుభూతిని అందిస్తుందన్నారు. సమృద్ధిగల సహజ వనరులు, గోదావరి,
కృష్ణా, పెన్నా నదీ పరీవాహక సారవంతమైన ప్రాంతాలు, విస్తృతమైన కాలువలు,
అనుకూలమైన వ్యవసాయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ సొంతమన్నారు. వరిని పండించే
అగ్రగామి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉందని, తూర్పు తీరంలో లాజిస్టిక్స్
హబ్‌గా, దేశంలో 974 కి.మీ.ల రెండవ పొడవైన తీర రేఖను కలిగి ఉండటం ప్రత్యేకత
అన్నారు. రాష్ట్రంలో 6 ఓడరేవులు, 6 విమానాశ్రయాలు, 123,000 కి.మీ రోడ్డు
నెట్వర్క్, 2,600 కి.మీ రైలు నెట్వర్క్ ఉందని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
ఉన్నందున ఆంధ్రప్రదేశ్ కొత్త వ్యాపార అవకాశాలకు మార్గం చూపుతుందన్నారు. శ్రీ
సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ 27 దేశాలకు చెందిన 180 కంపెనీలకు నిలయంగా ఉందని,
వ్యూహాత్మక ప్రదేశంలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలకు ఇది ఒక ముఖ్య ఉదాహరణ
వంటిదని గవర్నర్ రాష్ట్రపతికి వివరించారు. ప్రధానంగా వ్యవసాయంపై రాష్ట్రం
ఆధారపడగా, దాదాపు 60శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఉపాధి
పొందుతున్నారన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం చేపలలో 30శాతం పైగా వాటాను
కలిగి సముద్ర ఆహారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుందన్నారు. విదేశీ ప్రత్యక్ష
పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. విశాఖపట్నం
సమీపంలోని భోగాపురంలో ప్రపంచ స్థాయి ఎయిర్ కార్గో కాంప్లెక్స్ కూడా
రాబోతుండగా, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ సాధించిన మొదటి
ర్యాంక్ రాష్ట్రం అందించే వ్యాపార అనుకూల వాతావరణానికి దిక్సూచి వంటిదన్నారు.
3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 20 స్వయంప్రతిపత్త సంస్థలు, 25 రాష్ట్ర , 4
డీమ్డ్, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక ప్రధాన విద్యా
కేంద్రంగా ఉందన్నారు. సమీప భవిష్యత్తులో దేశంలోని కీలకమైన అభివృద్ధి రంగాలలో
ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు సాగుతుందని, అధిక వృద్ధి రేటును సాధించేందుకు
సిద్ధంగా ఉంటుదని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు.