▪️వెనుకబడిన ప్రాంతాలపై ప్రతిపక్షాల వైఖరి చెప్పాలి
▪️వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై తేలు కుట్టిన దొంగలా టీడీపీ
▪️రేపటి కర్నూలు రాయలసీమ గర్జనను] విజయవంతం చేయండి
-మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు పాలకుల భిక్ష కాదని, అది రాయలసీమ ప్రజల హక్కు అని
మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా
రాయలసీమలో హైకోర్టు కోసం జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో సోమవారం
కర్నూల్ పట్టణంలో జరగనున్న ‘రాయలసీమ గర్జన’ను విజయవంతం చేయాలని పార్టీ
శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రం అన్ని
విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం
దుద్దేకుంట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, వాల్మీకి
కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మధుసూదన్ ,అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి
కన్వీనర్ రమణ, జిల్లా అగ్రి అడ్వయిజరీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తదితరులు
ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ
సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి, వికేంద్రీకరణ పై ప్రతిపక్షాలు
తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ
విషయంలో తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా
అమరావతి అభివృద్ధి ఒక్కటేనా లేక మూడు ప్రాంతాలకూ సమన్యాయమైన వికేంద్రీకరణా అనే
విషయంపై తమ వైఖరిని తెలియపరచాలన్నారు.రాయలసీమ గర్జనకు ప్రజలు పెద్ద ఎత్తున
తరలిరావాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందన్నారు.ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అసెంబ్లీలో బిల్లు
పెట్టారని చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు కేవలం 29 గ్రామాలున్న అమరావతి ఒక్కటే
అభివృద్ధి అంటున్నాయన్నారు. ఇది తప్పని రాష్ట్రం మొత్తం సర్వతో ముఖాభివృద్ది
చెందాలనే డిమాండ్ గట్టిగా వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ
మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోయ సుశీలమ్మ ,వికేంద్రీకరణ సాధన సమితి కన్వీనర్ బెస్త
రమణ, శివలింగప్ప, బెళుగుప్ప ఎంపీపీ పెదన్న, కుడేరు ఎంపీపీ నారాయణరెడ్డి,
ఉరవకొండ ఎంపీపీ చందా చంద్రమ్మ, విడపనకల్ ఎంపీపీ కరణం పుష్పావతి, జెడ్పిటిసి
ఏసీ పార్వతమ్మ, కూడేరు అగ్రి అడ్వైజరి చైర్మన్ మేరీ నిర్మలమ్మ, నాయకులు
బైరెడ్డి రామచంద్రరెడ్డి, రాకెట్ల అశోక్ కుమార్, వైస్సార్సీపీ నాయకులు
పాల్గొన్నారు.