గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు : ప్రజలకు ఇచ్చిన హామీలను మాట తప్పకుండా ముఖ్యమంత్రి అమలు చేయడంతోనే
తామంతా ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార,
మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో
రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీలో
పర్యటించిన మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూడిపర్తి
మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి పనులను మంత్రి
ప్రారంభించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి ప్రజలను ఆప్యాయంగా
పలకరిస్తూ వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసి, ఇంకా ఏమైనా
సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ
ఎస్టీ బిసి మైనార్టీలకు, మహిళలకు అన్ని విధాల ప్రాధాన్యత కల్పిస్తూ, 50 శాతం
రిజర్వేషన్లు అమలు చేసి అనేక పదవులను కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కే
దక్కిందన్నారు. దివంగత మహానేత రెండు అడుగులు ముందుకేస్తే ఆయన తనయుడు జగన్మోహన్
రెడ్డి నాలుగు అడుగులు ముందుకేసి జనరంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు.
పూడిపర్తి గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు వాటర్
ట్యాంక్ ను నిర్మించామని, ఎస్సీ ఎస్టీలకు ఏ అభివృద్ధి పనిచేసినా వారు
జీవితాంతం గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాభావం చూపుతారని, తాను ఎప్పుడు వచ్చినా
నీరాజనాలు పలకడమే ఇందుకు నిదర్శనం అన్నారు. గతంలో గ్రామాలకు వెళ్లాలంటే ఎక్కడ
ప్రజలు సమస్యలతో నిలదీస్తారేమోనని భయమేసేదని, ఇప్పుడు ఘన స్వాగతం
పలుకుతున్నారన్నారు. గ్రామాలకు సంబంధించి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు
చేపట్టి గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. అర్హత ఒకటే
ప్రామాణికంగా ఎటువంటి దళారులు, నాయకులు లేకుండా నేరుగా బటన్ నొక్కి సంక్షేమ
పథకాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధి, సమగ్రంగా
సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ
కార్యక్రమంలో తాసిల్దారు నాగరాజు, సర్పంచ్ శ్రావణి, స్థానిక నాయకులు,
సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.