గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న 17 ప్రభుత్వ వైద్య
కళాశాలలో ఒకదానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కొణిజేటి రోశయ్య
పేరు పెట్టాలని జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన
జరిగిన ప్రధమ వర్ధంతి సభలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రధమ వర్ధంతి సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ
రెడ్డి అధ్యక్షత వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శాసన
మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ కొణిజేటి రోశయ్య తన
రాజకీయ అనుభవాలతో కఠినమైన సమస్యలను సహితం సమయస్ఫూర్తితో సులభంగా
పరిష్కరించేవారన్నారు.16 సార్లు ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర బడ్జెట్లను
ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కుతుందన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు మరో పేరుగా
నిలిచి రాష్ట్రం అప్పుల పాలు కాకుండా చూసిన మహనీయుడని తెలిపారు. శాసనసభ్యులు
మద్దాల గిరి ప్రసంగిస్తూ ఆర్యవైశ్యులను ఐక్యపరిచి సామాజిక సేవా సంస్థగా
ఆర్యవైశ్య సంఘానికి ప్రపంచ గుర్తింపు అందించిన రాజనీతిజ్ఞులు రోశయ్య అని
కొనియాడారు. రోశయ్య రాజకీయ అనుభవాల్ని నేటితరం నేతలు స్ఫూర్తిగా
తీసుకోవాలన్నారు.
సీనియర్ నేత మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రసంగిస్తూ
రాజకీయాలకి అతీతంగా రోశయ్య సేవల్ని గుర్తించి గౌరవించాలన్నారు. జన చైతన్య
వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ రోశయ్య
హిందూ కళాశాల విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారని
వారికి కాంస్య విగ్రహాన్ని గుంటూరులోని హిందూ కళాశాల కూడలిలో ప్రతిష్టించాలని
విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా ముఖ్యమంత్రిగా,
గవర్నర్ గా వారు అధిరోహించిన ప్రతి పదవికి వన్నెతెచ్చిన మహనీయులని కొనియాడారు
ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఏ.ఆర్ సుబ్రహ్మణ్యం, సిపిఎం నేత భావనారాయణ,
బిజెపి నేత వనమా నరేంద్ర, కాంగ్రెస్ పార్టీ నేత కొరివి వినయ్ కుమార్, జనసేన
పార్టీ నేతలు బి శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, కన్యకా పరమేశ్వరి
దేవస్థానం అధ్యక్షులు దేవరశెట్టి చిన్ని, ఆర్యవైశ్య సంఘం మాజీ కార్యదర్శి కోటా
నరేంద్ర, తెలుగు భాషా ఉద్యమ సంస్థ కన్వీనర్ డాక్టర్ వి సింగారావు, చరిత్ర
అధ్యాపకులు పాలేరుపోతురాజు, సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు చలపతి రావు
,మానవతా కో కన్వీనర్ సలీం మాలిక్, తుళ్లూరు సూరిబాబు, యడ్లపల్లి కృష్ణ
తదితరులు ప్రసంగించారు.