10 కి.మీ దూరం నుంచి చూసినా కనిపించేలా జగన్నాథగట్టుపై హైకోర్టు నిర్మిస్తాం
కర్నూలు జిల్లాలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించిన “రాయలసీమ గర్జన
సభ”లో ఆర్థిక మంత్రి బుగ్గన
కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో కర్నూలు జిల్లాలోని
జగన్నాథ గట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ప్రకటించారు. 10 కి.మీ దూరం నుంచి చూసినా కనిపించేలా జగన్నాథగట్టుపై హైకోర్టు
నిర్మిస్తామని మంత్రి బుగ్గన వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు నారా
చంద్రబాబు నాయుడు అనుకూలమో ..వ్యతిరేకమో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన
డిమాండ్ చేశారు. వికేంద్రీకరణతో సమన్యాయం సాధ్యమని నమ్మి సీఎం జగన్ హైకోర్టు
కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తన హయాంలో కుప్పాన్ని రెవెన్యూ డివిజన్
చేయడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. జగన్ మోహన్
రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేసినట్లు
మంత్రి వెల్లడించారు. మున్సిపాలిటీ సహా ఇంకా చాలా అభివృద్ధి పనులు కూడా ఈ
ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా హంద్రీనీవా,
పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి పనులకు నిధుల కేటాయింపు వైయస్ రాజశేఖర్ రెడ్డి
హయాంలోనే విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.6వేల కోట్ల విలువైన జల
ప్రాజెక్టులకు కేవలం రూ.15 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు కూడా రాయలసీమ
అభివృద్ధి, చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారని బుగ్గన అన్నారు.
సీమ ప్రజల త్యాగాన్ని గుర్తించి..న్యాయం చేయాలనుకున్న ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే
1953లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలును తొలి రాజధానిగా మార్చారని
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గుర్తు చేశారు. అనంతరం 1956లో రాజధాని
హైదరాబాద్‌కు మార్చబడిందన్నారు. ఇది పూర్తిగా రాయలసీమ ప్రాంత ప్రజల త్యాగంగా
ఆయన కొనియాడారు. 1956 నుంచి నేటి వరకు రాయలసీమ ప్రాంతం ఆశించినంతగా అభివృద్ధి
చెందలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన
ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు గానీ, మంత్రులెవరూ దాని అభివృద్ధి గురించి
ఆలోచించలేదన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అనుసరించి వెనుకబడిన రాయలసీమ
ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
కర్నూలును న్యాయశాఖ రాజధానిగా ప్రకటించారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలోనే సీమ ప్రాంత అభివృద్ధి న్యాయ రాజధానితోనే
సాధ్యమని గుర్తించడం జరిగింది అన్నారు. మేధావులు అధ్యయనం చేసి సూచించిన మేరకు
మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు. అన్ని ప్రాంతాలు
సమానంగా అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని వైసీపీ
ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంజాద్ బాషా,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.