మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు
* 8 నుంచి 10వ తేదీ వరకు దక్షిణ కోస్తా, తమిళనాడులో భారీ వర్షాలు*
*అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం
అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడినట్టు
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ సాయంత్రానికి ఇది క్రమంగా
వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ
కోస్తాంధ్ర-తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తూ మరింత బలపడి 8వ తేదీ ఉదయానికి
తుపానుగా మరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర-తమిళనాడు
తీరాలకు దగ్గరగా తుపానుగా మారిన అనంతరం తీవ్ర ప్రభావం చూపే సూచనలు ఉన్నట్టు
స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో 7వ తేదీ సాయంత్రం నుంచి తమిళనాడు,
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు
కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే 8 నుంచి 10వ తేదీ వరకు దక్షిణ కోస్తా,
తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు,
ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం
జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారమున్నట్టు ఐఎండీ వెల్లడించింది. 7 నుంచి 10వ
తేదీ వరకు మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు తీర ప్రాంతాల్లోని రెవెన్యూ యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణసంస్థ
అప్రమత్తం చేసింది.