ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్
విజయవాడ : రాష్ట్రంలోని బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి
ఛైర్మన్లను నియమిస్తే టీడీపీ నేతలు హేళన చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్
తమ్మినేని సీతారామ్ అన్నారు. బీసీల ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు ముసుగులు
వేస్తూ వస్తున్నారని ఆక్షేపించారు. విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్
స్టేడియంలో వైసీపీ ఆధ్వర్యంలో ‘జయహో బీసీ మహాసభ’ నిర్వహించారు. ఈ సభకు బీసీ
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల
నుంచి ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు
హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ‘‘బీసీల కోసం సీఎం జగన్
నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గత ఐదేళ్లలో బీసీలకు
చంద్రబాబు రూ.964 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ మూడేళ్లలోనే జగన్ రూ.90,415
కోట్లు అందించారు. రాబోయే సార్వత్రిక కురుక్షేత్రానికి మేం సిద్ధంగా ఉన్నాం.
ఐకమత్యంగా జగన్ వెంట ఉండి మళ్లీ ఆయన్ను సీఎంను చేస్తేనే ఈ సభకు సార్థకత. మనం
వార్ జోన్లో అడుగుపెట్టాం. శత్రు సంహారం చేసి జగన్ను మళ్లీ సీఎంగా
చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తమ్మినేని సీతారామ్ అన్నారు.