దేశ సంస్కృతికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని వెల్లడి
ఇంటాబయటా ఉపయోగించే ప్రతీ పనిముట్టు వెనకా బీసీలే
‘మీ హృదయంలో.. జగన్ హృదయంలో మీరు’ ఎప్పటికీ ఉంటారన్న ముఖ్యమంత్రి
ఈ ప్రభుత్వం మాది.. మా అందరిదీ అని చాటిచెప్పండని బీసీలకు పిలుపు
విజయవాడ : బీసీ సోదరులు, అక్కాచెల్లెళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ జయహో
బీసీ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం మొదలుపెట్టారు. బీసీలంటే బ్యాక్ వర్డ్
క్లాసులు కాదు.. బ్యాక్ బోన్ క్లాసులని స్పష్టం చేశారు. దేశ సంస్కృతి,
సంప్రదాయాలకు ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని జగన్ చెప్పారు. ‘మీ హృదయంలో జగన్..
జగన్ హృదయంలో మీరు ఎప్పటికీ ఉంటారు’ అని జగన్ తేల్చిచెప్పారు. మన పార్టీ
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీల అభివృద్ధికి అవసరమైన చర్యలు
తీసుకున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. బీసీలంటే శ్రమ, బీసీలంటే పరిశ్రమ
అని జగన్ తేల్చిచెప్పారు. ఇంటి పునాధి నుంచి పైకప్పు వరకు.. ఇంట్లో,
వ్యవసాయంలో ఉపయోగించే ప్రతీ పనిముట్టు వెనక బీసీల శ్రమ ఉందని వివరించారు.
బీసీల గురించి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చెప్పినట్లు.. కమ్మరి కొలిమి,
కుమ్మరి చక్రం, జాలరి మగ్గం, శాలెల మగ్గం.. గొడ్డలి రంపం, కొడవలి నాగలి.. ఇలా
మన సమస్త గ్రామీణ వృత్తుల సంగమమే బీసీలు అని సీఎం జగన్ కొనియాడారు.
రాజ్యాధికారంలో మేంకూడా భాగమేనని చంద్రబాబుకు చెప్పాలని బీసీలకు జగన్
సూచించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాది.. మా అందరిదీ అని గట్టిగా
నినదించండంటూ ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. ‘వెన్నెముక కులాల నా
అన్నదమ్ముల్లారా.. అక్కచెల్లెల్లారా.. బీసీలంటే కుట్టుమిషన్లు, ఇస్త్రీ
పెట్టెలు కాదని చంద్రబాబుకు చెప్పండి. 2014 ఎన్నికలలో బీసీల అభివృద్ధికి
ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చని చంద్రబాబుకు చెప్పండి..
బీసీలకు ఇచ్చిన హామీలను వందకు వంద శాతం నిలబెట్టుకున్న మా జగనన్న
ప్రభుత్వానికి మేమిప్పుడు వెన్నెముక కులాలుగా మారామని చంద్రబాబుకు చెప్పండని
జగన్ పేర్కొన్నారు.