అమరావతి : బీసీల ఓట్ల కోసం వైసీపీ, టీడీపీ పార్టీలు కపట నాటకాలు ఆడుతున్నాయని,
మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్ డాక్టర్
తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీసీల నిజమైన
నేస్తం కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలు పుట్టకముందే
1970లోనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 25 శాతం రిజర్వేషన్లు
కల్పించిందని గుర్తుచేశారు. 1993లోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. అలాగే 2008లోనే బీసీ
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను కాంగ్రెస్
ప్రవేశపెట్టిందని తెలిపారు. సీఎం జగన్కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జయహో
బీసీ సభలోనే ముఖ్యమంత్రి పదవి, లేక వైసీపీ అధ్యక్ష పదవుల్లో ఒకదానిని బీసీలకు
ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ రోజే ఒక్కొక్క బీసీ కార్పొరేషన్ కు రూ.100
కోట్లు విడుదల చేయాలని తులసిరెడ్డి అన్నారు.