విజయవాడ : మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇదే మాట ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని విజయవాడలో
జరిగిన జయహో బీసీ మహాసభకు హాజరైన ప్రజల్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ‘ఈ
యుద్ధం మంచికి చెడుకి మధ్య జరగబోతుందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీ,
వెన్నుపోటుకి మధ్య జరగబోతుందని చెప్పండి. మాట మీద నిలబడే నాయకత్వానికి,
ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి. ఈ
యుద్ధం సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య జరగబోతుందని చెప్పండి.
పేదల భవిష్యత్తుకు, పేదలు పేదలుగానే మిగిలిపోవాలని తాపత్రయపడే పెత్తందార్లకు
మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి. ఈ యుద్దంలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ,
మైనార్టీ, నిరుపేద వర్గాలు ఒకవైపు ఉంటే.. మరోవైపున బీసీల తోకలను కత్తరిస్తాను,
ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే దుర్మార్గమైన మనస్తత్వమున్న
చంద్రబాబునాయుడికి మధ్య యుద్దం జరగబోతుందని చెప్పండి’ అంటూ బీసీ శ్రేణులను
ఉద్దేశించి పిలుపును ఇచ్చారు.
చంద్రబాబుని నమ్మొద్దు : ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి
నియోజకవర్గంలోనూ, ప్రతి గడపకూ తీసుకునిపోవాలి. తేడా గమనించమని అందరినీ అడగండి.
మీ ఇంట్లోమంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి. మంచి జరగకపోతే వద్దమ్మా..
జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెప్పాడో అది
చేస్తాడు. చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా.. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల
స్వప్నాలను చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టే బంగారం ఇంటికి రావాలంటే బాబునే
ముఖ్యమంత్రి కావాలంటాడు. రైతులకు రుణమాఫీ కావాలంటే బాబే ముఖ్యమంత్రి
కావాలంటాడు. పిల్లలను మన రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా చదివిస్తాడు. తాను
ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాను అని కూడా అంటాడు. కానీ
నమ్మొద్దు. ఒక్కసారి నమ్మాం.. అడుగులు వెనక్కి పడ్డాయి. జగన్ని నమ్మాం, మన
ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మన బిడ్డని ముఖ్యమంత్రి స్ధానంలో
కూర్చొబెట్టుకున్నాం. మన బ్రతుకులు మారాయా? లేదా? అన్నది ఒక్కసారి గుండెల మీద
చెయ్యి వేసుకొని ఆలోచన చేయండి అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.