పేదలకు మరింత నాణ్యమైన వైద్యం
అతి త్వరలో పెట్ సిటీ స్కాన్ ప్రారంభం
ఎయిమ్స్ సిబ్బందికి శిక్షణ ఇస్తాం
24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చర్యలు
అదనంగా ఆరోగ్యమిత్రలను నియమిస్తాం
ఆరోగ్యశ్రీ రోగుల కోసం ఉచితంగా వాహనం సమకూరుస్తాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
ఆరోగ్యశ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం – ఎయిమ్స్ మధ్య అవగాహన ఒప్పందం
అమరావతి : ఇకపై మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో పేదలందరికీ
ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర వైద్య
ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఎయిమ్స్ – రాష్ట్ర ప్రభుత్వం
మధ్య ఆరోగ్యశ్రీ విషయమై గురువారం అవగాహన ఒప్పందం జరిగింది. ఇరు
పక్షాలు ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని
మాట్లాడుతూ పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే రాష్ట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనల మేరకు ఎయిమ్స్‌తో అవగాహన
ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కొద్ది రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ
ట్రయల్ రన్‌ను చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 100 మందికిపైగా రోగులకు
ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామని తెలిపారు. 30 మందికిపైగా
చికిత్స చేయించుకుని ఇంటికి కూడా చేరుకున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో
గురువారం అధికారికంగా ఇరు పక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని
పేర్కొన్నారు. ఇకపై ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులందరికీ పూర్తి
ఉచితంగా వైద్య సేవలు అందుతాయని చెప్పారు. దీనివల్ల పేదలకు వైద్య సేవలు
మరింత నాణ్యంగా పూర్తి ఉచితంగా అందుతాయని పేర్కన్నారు.
క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యం
ఎయిమ్స్‌లో అతి త్వరలో పెట్ సిటీ స్కాన్‌ను ప్రారంభించబోతున్నామని మంత్రి
విడదల రజిని పేర్కొన్నారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ అవశేషాలు ఉన్నా
సరే ఈ స్కాన్ ద్వారా పసిగట్టేయొచ్చని తెలిపారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ
స్థాయి వైద్యం ఏపీలో నే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఎయిమ్స్ కు ఇప్పుడు రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు.
మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్ల
నుంచి మూడేసి లక్షల లీటర్ల చొప్పున మొత్తం ఆరు లక్షల లీటర్ల నీటిని
సరఫరా చేస్తున్నామని వివరించారు. దీనివల్ల ఎయిమ్స్ లో పూర్తి బెడ్
సామర్థ్యం మేర వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే జూన్ కల్లా
పైపు లైను పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. ఇదిమంచినీటి సమస్యకు
శాశ్వత పరిష్కారం అని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎయిమ్స్ లో 24
గంటలూ అందించాలని, అందుకోసం అదనంగా ఆరోగ్యమిత్రలను కూడా
నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్ నుంచి రోగులను
మంగళగిరికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించాలని సూచించారు.
స్పందించిన అధికారులు వెంటనే ఉచిత వాహనాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి, ఎయిమ్స్ డిప్యూటీ మెడికల్
సూపరింటెండెంట్ వంశీకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి
ఎం.టి.కృష్ణబాబు, ప్రభుత్వ కార్యదర్శి నవీన్‌కుమార్, కమిషనర్
ఫ్యామిలీ వెల్ఫేర్ జే ఎస్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్
తదితరులు పాల్గొన్నారు.