ఎయిర్‌పోర్టు మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన
నగరంలో సీఎం కేసీఆర్ టూర్
మెట్రో-2 శంకుస్థాపన, బీఆర్ఎస్ ఆవిర్భావంతో బిజీబిజీ
హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
చుట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం
కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్టు
ఎక్స్‌ప్రెస్ మెట్రోకు మైండ్‌స్పేస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం
ఆయన పునాదిరాయి వేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని
శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఒకప్పుడు నగరంలో తాగు నీటి సమస్య ఉండేది.
ప్రత్యేక రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చూసుకున్నాం. అన్ని కష్టాలను
అధిగమించి ముందుకు వెళ్తున్నాం. అందరికీ అనువైన వాతావరణ నగరంలో ఉంది.
అన్నివర్గాలను అక్కన చేర్చుకుంది ఈ విశ్వనగరం. చరిత్రలో హైదరాబాద్ ఓ
సుప్రసిద్ధమైన నగరం ఇది. న్యూయార్క్, పారిస్, లండన్‌లో కరెంట్ పోవచ్చు.
కానీ, హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోయే అవకాశం లేదు. 1912లోనే నగరానికి
కరెంట్ సదుపాయం ఉండేది. దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో పెద్దది
హైదరాబాద్. అలాంటి నగరంలో మెట్రో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో ముందుకు
పోతున్నాం. పరిశ్రమ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందన్నారు.