హైదరాబాద్: హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరమని ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం అప్పా పోలీస్ అకాడమీలో
ఏర్పాటు చేసిన మెట్రో సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. న్యూయార్క్,
పారిస్, లండన్‌లో కరెంట్ పోవచ్చు. కానీ, హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోయే
అవకాశం లేదు. 1912లోనే నగరానికి కరెంట్ సదుపాయం ఉండేది. హైదరాబాద్ నిజమైన
విశ్వనగరం. చరిత్రలో సుప్రసిద్ధమైన నగరం ఇది. అలాంటి నగరంలో ఒకప్పుడు నగరంలో
తాగు నీటి సమస్య ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చూసుకున్నాం.
అన్ని కష్టాలను అధిగమించి ముందుకు వెళ్తున్నాం. అందరికీ అనువైన వాతావరణ
నగరంలో ఉంది. అన్నివర్గాలను అక్కన చేర్చుకుంది ఈ విశ్వనగరం.
దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో పెద్దది హైదరాబాద్. అలాంటి నగరంలో
మెట్రో.. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో ముందుకు పోతున్నాం. పరిశ్రమ రంగంలో
హైదరాబాద్ దూసుకుపోతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మెట్రో సెకండ్
ఫేజ్ పనుల కోసం హెచ్ఎండీఏ తరపున పదిశాతం పెట్టుబడి రూ. 625 కోట్ల రూపాయలు.
హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద కుమార్ సీఎం కేసీఆర్‌కు అందించారు. అలాగే
జీఎంఆర్ తరపున పదిశాతం రూ.625 కోట్ల రూపాయల చెక్ సీఎం కేసీఆర్‌కు అందజేశారు.
ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం ఇలా : మైండ్‌స్పేస్ కూడలి నుంచి 0.9 కి.మీ.
దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్పోర్ట్ స్టేషన్‌తో విమానాశ్రయ
మెట్రో ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ కూడలిలోని రెండు
ఫ్లైఓవర్లను దాటుకుని నేరుగా కాజాగూడ చెరువు పక్క నుంచి ఎలైన్మెంట్
వెళ్తుంది. కాజాగూడ నుంచి కుడివైపు తిరిగి నానక్‌రాంగూడ కూడలి, అక్కడి నుంచి
ఓఆర్ఆర్ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్,
విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా జీఎంఆర్
సమన్వయంతో ఎలైన్మెంట్ రూపొందించారు.
ప్రత్యేకతలివీ : విమానాశ్రయ మెట్రోలో ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అధునాతన
సౌకర్యాలు కల్పిస్తారు. ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించేలా సీట్లు
(ఛైర్కార్లు) ఉంటాయి. ప్లాట్‌ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన స్క్రీన్
విండోస్ ఏర్పాటు చేస్తారు. స్టేషన్లో మెట్రోరైలు ఆగిన తర్వాత కోచ్‌ల తలుపులు
తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి. రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో
డైనమిక్స్‌లో మార్పు చేస్తారు. తేలికపాటి స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం
కోచ్‌లు ఉంటాయి. కారిడార్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో స్టేషన్లు
నిర్మిస్తారు. వాటికి ప్రయాణికులు చేరుకునేలా స్కైవాక్‌లు ఏర్పాటు చేస్తారు.
స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేస్తారు.
సీఐఎస్ఎఫ్ పోలీసుల సమన్వయంతో లగేజీ తనిఖీలు చేస్తారు.