వాషింగ్టన్ : చైనా- తైవాన్ ల మధ్య వివాదం కొనసాగుతోన్న వేళ ఆ ద్వీప దేశానికి
అమెరికా భారీ సైనిక సహాయ నిధిని ప్రకటించింది. అగ్రరాజ్య ప్రతినిధుల సభ తాజాగా
ఆమోదించిన రక్షణ వ్యయ బిల్లులో దీన్ని పొందుపర్చింది. ఇందులో భాగంగా తైవాన్‌కు
అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు సైనిక సాయం అందనుంది. 2023 నుంచి 2027
వరకు ఏడాదికి రెండు బిలియన్ డాలర్ల చొప్పున ఈ మొత్తాన్ని మంజూరు చేయనుంది.
సెనేట్ ఆమోదం, దేశ అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో ఈ బిల్లు జాతీయ రక్షణ అధికార
చట్టం గా రూపొందుతుంది. తైవాన్‌కు అమెరికా తన ఆయుధ నిల్వల నుంచి ఏడాదికి ఒక
బిలియన్ డాలర్ల విలువైన రక్షణ సామగ్రి అందజేత లేదా సైనిక శిక్షణ వంటి సేవలను
సమకూర్చేందుకు ఈ చట్టం అధికారం కల్పిస్తుంది.
‘ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాం’ కింద ఈ తోడ్పాటు అందించనుంది. తైవాన్‌తో
అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని ఈ నిర్ణయాలు గణనీయంగా మెరుగుపరుస్తాయని ఫారిన్
రిలేషన్స్ కమిటీ ఛైర్మన్ సెనేటర్ బాబ్ మెనెండెజ్ బిల్లు ఆమోదానికి ముందు ఒక
ప్రకటనలో తెలిపారు. మరోవైపు తైవాన్‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా
నిర్ణయంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి
మావో నింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏఏ పేరిట చైనా వ్యతిరేక నిర్ణయాలను
ఆమోదించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా తైవాన్ తమ భూభాగమే అని
డ్రాగన్ పేర్కొంటోన్న విషయం తెలిసిందే. మరోవైపు తైవాన్ దీన్ని తోసిపుచ్చుతూ
వస్తోంది. ఈ విషయంపై ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. మరోవైపు ఏమైనా
సమస్యలు తలెత్తితే తైవాన్‌కు అండగా నిలుస్తామంటూ అమెరికా పలు సందర్భాల్లో
ప్రకటనలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సైనిక గ్రాంట్‌ను ప్రకటించింది.