హైదరాబాద్ : శిర్డీ, జైపుర్, హుబ్బళ్లి వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు
వెళ్లాలంటే ఇకపై విజయవాడ, సికింద్రాబాద్ వంటి పెద్ద రైల్వేస్టేషన్లకు వెళ్లి
ఎక్కాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయి. మచిలీపట్నం, కర్నూలు, మహబూబ్‌నగర్,
వరంగల్ వంటి జిల్లా కేంద్రాల నుంచే ఈ రైళ్ల ప్రయాణం మొదలవనుంది. మొత్తం 10 జత
(రాను, పోను)ల దూరప్రాంత రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే బోర్డు ఏడు జోన్ల
అధికారులకు తెలిపింది. మూడేళ్లుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనలపై ఇటీవల కేంద్ర
పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించడంతో
తాజాగా ఈ నిర్ణయం వెలువడింది.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే జైపుర్ రైలు (19713/19714)కు ఏపీలోని
కర్నూలును ప్రారంభ స్థానంగా మార్చారు. దీంతో కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్,
షాద్‌నగర్ ప్రాంతవాసులకు ప్రయోజనం చేకూరనుంది. విజయవాడ నుంచి ఖమ్మం,
సికింద్రాబాద్, వికారాబాద్ మీదుగా సాయినగర్ శిర్డీ (17207/17208) వెళ్లే
రైలు ఇక మచిలీపట్నం నుంచి బయల్దేరనుంది. దీంతో మచిలీపట్నంతో పాటు గుడివాడ,
గుడ్లవల్లేరు, పెడన వాసులకు ప్రయోజనం. ధర్మవరం-విజయవాడ రైలు (17215/17216)
ఇకపై మచిలీపట్నంవరకు రాకపోకలు సాగిస్తుంది.
కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ (17225/17226)కు వచ్చిపోయే రైలును
నరసాపురం వరకు పొడిగించారు. దీంతో గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం,
పాలకొల్లు నుంచి కూడా హుబ్బళ్లికి వెళ్లి రావచ్చు. విశాఖపట్నం-కాచిగూడ
ఎక్స్‌ప్రెస్ (12861/12862)ను మహబూబ్‌నగర్ వరకు పొడిగించారు. దీనివల్ల
మహబూబ్‌నగర్, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల వాసులకు ప్రయోజనం. విశాఖపట్నం-
విజయవాడ ఎక్స్‌ప్రెస్ (22701/22702)ను గుంటూరు వరకూ
పొడిగించారు.తాండూరు-హెచ్ఎస్ నాందేడ్ రైలు (17663/17664)ను కర్ణాటకలోని
రాయచూరుకు పొడిగించారు. మహారాష్ట్రలోని హడాప్సర్ (పుణె)-హైదరాబాద్
(17013/17014) రైలును కాజీపేట వరకు పొడిగించారు. అదనంగా సికింద్రాబాద్,
భువనగిరి, జనగామ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. నంద్యాల-కడప ప్యాసింజర్
(77401/77402)ను రేణిగుంట వరకు పొడిగించారు. దీంతో ఒంటిమిట్ట, నందలూరు,
రాజంపేట, ఓబుళవారిపల్లె, కోడూరు, బనగానపల్లి వాసులకు ప్రయోజనం కలగనుంది.
నిజామాబాద్-కరీంనగర్ ప్యాసింజర్ (77259/77260)ను బోధన్ వరకు పొడిగించారు.
దీంతో జానకంపేట, గాంధీపార్క్ స్టేషన్లలో అదనంగా ఈ రైలు ఆగనుంది.