శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆధ్యాత్మిక ప్రయాణం మానవాళికి
ఆదర్శం
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, వేదాలను పరిరక్షించిన ఘనత వారిది
ప్రజల మధ్య సామరస్యాన్ని ఆకాంక్షించిన సార్వత్రిక సామరస్యవాది ఆయన
దేవాలయాల ప్రాముఖ్యత పట్ల అవగాహన కల్పించటంలో కంచి కామకోటి పీఠం పోషించిన
పాత్ర ఉన్నతమైనది
ముంబై : శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఆధ్యాత్మిక యాత్ర మానవాళికి
నూతన ఆదర్శాన్ని పరిచయం చేసిందని, ఆధ్యాత్మిక మార్గంలో నూతన శకానికి నాంది
పలికిందని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వారి
బోధనలు ప్రజా జీవితాల్లో ప్రవేశించటమే గాక, వారి ఆలోచనలు మరియు ఆచరణలు
మార్గనిర్దేశం చేశాయన్న ఆయన, శ్రీ కంచి మహాస్వమి స్ఫూర్తిదాయకమైన ఆద్యాత్మిక
చిహ్నంగా అభివర్ణించారు. ప్రజా నాయకత్వంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు చేసిన
కృషికి, ఎస్.ఐ.ఈ.ఎస్. సంస్థ 25వ నేషనల్ ఎమినెన్స్ అవార్డు -2022ను ఆయనకు
అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన శ్రీ కంచి మహాస్వామి వారు భక్తుల
హృదయాలపై శాశ్వత ముద్ర వేశారని పేర్కొన్నారు. నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో
సుదీర్ఘ రాజకీయ జీవితంతో పాటు, రాజ్యాంగబద్ధమైన పదవిలో వారు చేసిన కృషి
నేపథ్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకయ్యనాయుడు, కంచి కామకోటి పీఠం 68వ
శంకరాచార్య పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్మారక అవార్డును స్వీకరించారు.
తాము ఎంతో ఇష్టంగా అంగీకరించిన అతికొద్ది అవార్డుల్లో ఇదొకటన్న ఆయన,
చిత్తశుద్ధితో చేసే పని తనకు తానుగా మాట్లాడుతుందని పేర్కొన్నారు. ఇది సాధారణ
అవార్డుల వేడక కాదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, శ్రీ కంచి మహాస్వామి వారి
ఆశీస్సులు, ఆశీర్వాదం ఉందని తెలిపారు. విశిష్టమైన ఎంతో మంది ఈ పురస్కారాన్ని
అందుకున్నారన్న ఆయన, ఆచార్యుల వారి ఆశీర్వాదంగా దీన్ని భావిస్తున్నట్లు
తెలిపారు. వినయంతో స్వీకరిస్తున్న ఈ అవార్డును వారి తల్లిదండ్రులైన
రంగయ్యనాయుడు, రమణమ్మలకు ఆయన అంకితం చేశారు. తన అమ్మమ్మ, తాతయ్యలు పెంచడమే
కాకుండా, విలువలు పెంపొందించారని, ఆ విలువలు, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలనే
అభిరుచి తనలో పెంపొందిందని, ఇవే తనను జీవితాంతం ఉన్నతంగా నిలబెట్టాయని
పేర్కొన్నారు. కంచి మహాస్వామి వారి గొప్ప సహకారం వేద సంస్కృతి పరిరక్షణకు
తోడ్పడిందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, వేదాలు మన సంస్కృతి, సంప్రదాయం మరియు
విజ్ఞానాల భాండాగారంగా అభివర్ణించారు. మహాస్వామి వారు అసమానమైన రీతిలో వేదాలను
పునరుజ్జీవింపజేయడమే గాకుండా, వాటి పోషించి, చైతన్యం నింపారని, మెరవ్వరూ
కాపాడలేని విధంగా కాలానుగుణంగా వేదాలకు శాశ్వతత్వాన్ని కల్పించే ప్రయత్నం
చేశారన్నారు. భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగమైన వేదాలు, ప్రపంచంతో పాటు సమస్త
మానవాళికి ఆధ్యాత్మిక పోషణను అందించాయని పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని గొప్ప
గౌరవంగా అభివర్ణించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, స్వామివారు అందించిన ఉన్నత
విలువలను కాపాడాలనే గొప్ప బాధ్యతను కూడా ఈ పురస్కారం అందించిందని తెలిపారు.
కంచి మహాస్వామి వారిని సార్వత్రిక సామరస్య వాదిగా అభివర్ణించిన స్రీ ముప్పవరపు
వెంకయ్యనాయుడు, 1966 అక్టోబర్ 23న ఐక్యరాజ్యసమితిలో భారతరత్న డా.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఆలపించిన సార్వత్రిక సామరస్య గీతం మైత్రీమ్ భజతను
స్వామివారే రచించారని గుర్తు చేసుకున్నారు. మహా స్వామి తర్వాత కంచి 69వ
పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి సమాజంలోని అట్టడుగు వర్గాలకు
అందించిన అసాధారణమైన సేవలను ఈ సందర్భంగా ఉటంకించిన ఆయన, మానవ సేవే మాధవసేవ అనే
స్ఫూర్తి వారు ఉదాహరణగా నిలిచారన్నారు. సుదీర్ఘమైన కంచి కామకోటి పీఠం చరిత్రలో
దేవాలయాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కీలక పాత్ర
పోషించిందన్న ఆయన, దేవాలయాలకు సంబంధించిన వివిధ అవసరాలు తీర్చే విధంగా
ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు జనకళ్యాణ
ఉద్యమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అనేక పాత శిథిలమైన
దేవాలయాలను మటం పునరుద్ధరించిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 80వ
దశకం చివరలో, 90వ దశకంలో, 20వ దశకం ప్రారంభంలో రామ మందిర సమస్య పరిష్కారం
విషయంలో మధ్యవర్తిత్వం వహించిన విషయంలో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు
పోషించిన పాత్రను ఈ సందర్భంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు.
వారి సామర్థ్యం పట్ల మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కి ఉన్న ఉన్న అపారమైన
విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి
వారు ప్రారంభ ప్రయత్నాలు ఇరు వర్గాల మధ్య ముందు అపనమ్మకాన్ని తగ్గించాయని,
చివరకు న్యాయస్థానాల ద్వారా శాంతియుతమైన సామరస్యాన్ని తీసుకురావటానికి
తోడ్పడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్,
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. మార్తాండ
వర్మ శంకరన్ వలియనాథన్, భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు ప్రొ. అజయ్ కె.
సూద్, ప్రముఖ హరికథా కళాకారిణి విశాఖ హరి సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు
పాల్గొన్నారు.