ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
విజయవాడ : మాండూస్ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వ్యక్తికి రూ. వెయ్యి,
కుటుంబానికి గరిష్టంగా రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస
కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఈ ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది.
తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య,
వైఎస్సార్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. కాగా
మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది.
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం,
వైఎస్సార్ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు
వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత, భారీ
వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో వర్షపు నీరు మోకాలి లోతున
ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వాగులు, వంకలు పొంగి
పొర్లుతున్నాయి.