వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి
అమరావతి : తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకి
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2014 అనేది ఒకటుందని, దానిలోని కొన్ని నిబంధనల
ప్రకారం నవ్యాంధ్రకు ప్రయోజనాలు చేకూర్చాల్సి ఉంటుందనే ఇప్పుడు
గుర్తుకొచ్చిందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల
కోఅర్డినేటర్,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఒక
ప్రకటనను విడుదల చేశారు. ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వారం రోజుల
లోపే 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన టీడీపీ నేత అప్పటి నుంచి
నాలుగేళ్లు సంవత్సరాలు ఈ చట్టం గురించి మరిచిపోయారని అన్నారు. ఎన్నికల్లో తన
మిత్రపక్షమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నాగాని ఈ పునర్వ్యవస్థీకరణ
(విభజన) చట్టం నిబంధనల ప్రకారం విభజిత రాష్ట్రానికి చేయించుకోవాల్సిన పనుల
గురించి ఆలోచించలేదని చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరుతో నాలుగు
రాళ్లు పోగేసుకోవడం ఒక్కటే ఆయన లక్ష్యం అయిందని మండిపడ్డారు.విభజన చట్టం
ఆమోదించిన సమయంలో పార్లమెంటులో కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా
అవసరం లేదనట్టు చంద్రబాబు పలుమార్లు చెప్పారన్నారు. తీరా ఎన్నికలు ఏడాదిలో
వస్తున్నాయనగా తెలుగుదేశం పార్టీ 2018 వేసవిలో ఎన్డీఏ నుంచి వైదొలిగి, దానికి
సాకుగా ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అని ప్రజల్ని మభ్య పెట్టే విఫలయత్నం చేశారని
అన్నారు.
నాలుగేళ్లు కేంద్రం చెప్పుచేతల్లో ఉన్న బాబు గారికి హఠాత్తుగా విభజన చట్టం
నిబంధనలు చాలా ఆలస్యంగా గుర్తుకొచ్చాయని అన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు అంటే 2024
ఎన్నికలకు 16 నెలల సమయం ఉందనగా మాజీ సీఎం హోదాలో ఉన్న ఈ 72 సంవత్సరాల నేతకు ఈ
చట్టం, దానిలోని నిబంధనల అమలు సంగతి గుర్తుకొచ్చాయాని ప్రశ్నించారు. ఇంతకీ,
ఇన్నేళ్లకు ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం నారా వారి బుర్రలోకి ప్రవేశించి ఆయన నోట
పలకడానికి కారణం లేకపోలేదన్నారు. విభజన చట్టంపై పిటిషన్లు విచారిస్తున్న
సుప్రీంకోర్టు సమైక్య ఏపీని పునరుద్ధరుస్తే తమకు ఆనందదాయకమని పాలకపక్షం
ప్రకటించగానే టీడీపీ అగ్రనేతకు కోపం వచ్చిందన్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం
పలికిన పలుకులు విన్న సామాన్య ప్రజానీకం ఆయన మెదడు నిజంగా పనిచేస్తోందా? అంటూ
ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్న ఆయన విమర్శ బుర్ర ఉన్న ఏ మనిషికీ
హేతుబద్ధంగా కనిపించదు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉండగా విభజన డిమాండును
తేలికగా తీసుకోవడమేగాక, చివరికి అవిభక్త రాష్ట్రంగా ఉన్న ఏపీ చీలిపోవడానికి తన
వంతు పాత్ర పోషించారు చంద్రబాబు అని మండిపడ్డారు. నేడు విభజన నష్టాల గురించి
ఆయన మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు.