గుంటూరు : అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ
జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వ విధానాలు ఇతర
రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై విషం
చిమ్ముతున్నారని, చంద్రబాబు గెజిట్ అయిన ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారని
మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ పాలనకు వాలంటీర్లు చేదోడువాదోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు
హయాంలో జన్మభూమి కమిటీలు యథేచ్ఛగా దోచుకున్నాయని మంత్రి అంబటి ప్రస్తావించారు.
జన్మభూమి కమిటీల ఆరాచకాలపై ఈనాడులోనే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. తమ
ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల
వ్యవస్థ ప్రజలకు అతి చేరువగా సేవలందిస్తోందన్నారు. ప్రతినెల ఒకటో తేదీన ఇంటికి
వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. లంచాలకు అవకాశం లేకుండా ప్రజలకు
సంక్షేమ పథకాలు అందతున్నాయని చెప్పారు. ‘చంద్రబాబు మోచీతి నీళ్లు తాగే కొన్ని
పత్రికలు, ప్రతి వ్యవస్థపైనా నిత్యం నిప్పులు కక్కుతున్నాయి. చంద్రబాబు
హయాంలో 39 లక్షల మందికే పెన్షన్లు. జగన్ హయాంలో 42 లక్షల మందికిపైగా
పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్లు తప్పు చేస్తే ప్రభుత్వానికి
ఫిర్యాదు చేయవచ్చు. తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. తనకు ఇవే
చివరి ఎన్నికలని చంద్రబాబు అంటున్నారు.చంద్రబాబుతో ఇదేం కర్మ అంటూ ప్రజలు
తలకొట్టుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి చంద్రబాబే కారణం’ అంటూ
మండిపడ్డారు.