భక్తులకు ప్యాకెట్ల రూపములో అన్నదానం
ఆలయ కార్య నిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ
విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లోని
మహా మండపం 6వ అంతస్తు నందు ఆలయ కార్య నిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ
భవానీ దీక్షా విరమణల సందర్బంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ
కార్యనిర్వాహణ అధికారి భవానీ దీక్షా విరమణల సమాచారం, పెద్ద ఎత్తున విచ్చేయు
భక్తుల సౌకర్యార్థం చేయుచున్న ఏర్పాట్ల గురించి తెలిపారు. ఈ సందర్బంగా కార్య
నిర్వాహణాధికారి మాట్లాడుతూ ఈనెల15 నుండి 19 వ తేదీ వరకు దేవస్థానం నందు
వైభవముగా నిర్వహించబడు అమ్మవారి భవానీ దీక్షా విరమణ మహోత్సవములలో భాగముగా
మొదటి రోజు 15 న ఉదయం 6 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభించబడునని, అనంతరం 6.30
గంటలకు హోమగుండములు అగ్ని ప్రతిష్ఠాపన జరుగునని తెలిపారు. ప్రతిరోజూ ఉ.3 గంటల
నుండి రాత్రి 11గంటల వరకు దర్శనం కల్పించబడునని, 19న ఉదయం10 గంటలకు
మహాపూర్ణహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
గత సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని, భక్తులు వినాయక గుడి నుండి
ప్రారంభమయ్యే క్యూలైన్లు ద్వారా ఘాట్ రోడ్ మీదుగా దేవస్థానము చేరుకొని,
అమ్మవారిని దర్శించుకొని, శివాలయము మెట్ల మార్గం ద్వారా క్రిందకి చేరుకుని,
హోమగుండం ఎదురుగా ఏర్పాటు చేసియున్న ఇరుముడి పాయింట్లు వద్ద భక్తులు ఇరుముడులు
సమర్పించవచ్చని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రూ.100, రూ.300, రూ.500ల
టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. రూ.500 ల టికెట్ కలిగిన భక్తులకు
వీ ఎం సీ హోల్డింగ్ ఏరియా, మోడల్ గెస్ట్ హౌస్ నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు
చేసి ఓం-టర్నింగ్ వద్ద రూ.500 ల ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనం ఏర్పాటు
చేయనున్నట్లు తెలిపారు. భక్తులు గత సంవత్సరముల కంటే ఎక్కువ సంఖ్యలో
విచ్చేయనున్నందున ప్యాకెట్ల రూపములో అన్నదానం జరుపుటకు ఏర్పాట్లు
చేస్తున్నట్లు తెలిపారు.
ప్రసాదముల కొరకు కనకదుర్గానగర్ నందు 10 కౌంటర్లు, బస్టాండ్ నందు 1, రైల్వే
స్టాండ్ నందు 1 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 20 లక్షల లడ్డు తయారు
చేస్తున్నట్లు, సుమారు 15లక్షల వాటర్ ప్యాకెట్ లు అందుబాటులో ఉంచుటకు ప్రపోజ్
చేసినట్లు తెలిపారు. భవానీ దీక్ష విరమణల సందర్భముగా దేవస్థానము నందు
నిర్వహించు అన్ని ప్రత్యక్ష ఆర్జిత సేవలు దేవస్థానము తరుపున మాత్రమే
నిర్వహించడము జరుగునని, భక్తుల సౌకర్యార్థం పరోక్షంగా పూజలు వారి గోత్ర
నామములపై నిర్వహించబడునని తెలిపారు. భవానీ భక్తుల కొరకు 3 ప్రదేశములలో-
సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ లలో 3 షిఫ్ట్ లలో మొత్తం 800
పైగా నాయీ బ్రాహ్మణులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సీతమ్మవారి పాదాలు,
భవానీ ఘాట్, పున్నమి ఘాట్ ల యందు స్నానమునకు షవర్స్ ఏర్పాటు చేయనున్నామని,
భవానీ భక్తులు విడిచిన దుస్తులు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన స్టాల్స్ నందు
ఉంచాలని కోరారు. పాదరక్షలు, లగేజీ ఉంచుటకు వీఎంసీ వారి ద్వారా ఉచితముగా
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
డీఎంఅండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో 20 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయుటకు ప్రపోజ్
చేశామని తెలిపారు. ప్రస్తుత 200 సీసీ కెమెరాలతో పాటు అదనముగా 57 సీసీ కెమెరాలు
ఏర్పాటు చేసి కలెక్టర్ కార్యాలయం, కంట్రోల్ రూమ్, మోడల్ గెస్ట్ హౌస్ ల నుండి
నిరంతరం పర్యవేక్షణ జరుగునన్నారు. రెడ్ క్రాస్, భవానీ భక్తుల సేవలు అన్నదానం,
ఇతర ప్రదేశముల యందు వినియోగించుకోనట్లు తెలిపారు. 13 రాత్రి కల్లా దేవస్థానం
తరపు ఏర్పాట్లన్నీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో ఆలయ వైదిక
కమిటీ సభ్యులు ఆర్. శ్రీనివాస శాస్త్రి, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి.
ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి, సహాయ కార్య నిర్వాహణ అధికారి, పి.
సుధారాణి, ఎన్.రమేష్, బి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.