చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లే సన్నాహాల్లో భాగంగా నాసా చేపట్టిన
ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతమైంది. నవంబరు 16న నింగిలోకి దూసుకెళ్లిన ఒరాయన్
క్యాప్సూల్ తిరిగి భూమిని చేరింది. మనుషులను తిరిగి చందమామ వద్దకు తీసుకెళ్లే
సన్నాహాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన మానవరహిత
ఆర్టెమిస్-1 యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పయనమైన
ఒరాయన్ క్యాప్సూల్ జాబిల్లిని చుట్టి, అనుకున్న రీతిలో ఆదివారం క్షేమంగా
భూమికి తిరిగొచ్చింది. అపోలో-17 పేరిట చివరిసారిగా మానవులు చంద్రుడిపై
కాలుమోపి 50 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ పరిణామం జరగడం విశేషం. ఆర్టెమిస్-1ను
నాసా ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఒరాయన్ మానవులను చంద్రుడిపైకి చేరవేసి,
తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురాగలదా అన్నది పరీక్షించడం దీని ఉద్దేశం.
అందువల్ల ఈ దఫా ఆ క్యాప్సూల్లో మానవులకు బదులు మూడు డమ్మీలను ఏర్పాటు చేశారు.
అందులో వివిధరకాల డేటా సేకరణకు సెన్సర్లను ఏర్పాటు చేశారు.
ఒరాయన్ను నవంబరు 16న నింగిలోకి పంపారు. శక్తిమంతమైన స్పేస్ లాంచ్ సిస్టమ్
(ఎస్ఎల్ఎస్) రాకెట్పైన దీన్ని ఉంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అనంతరం
ఎస్ఎల్ఎస్ నుంచి విడిపోయిన ఒరాయన్ చంద్రుడి దిశగా పయనాన్ని ఆరంభించింది.
నవంబరు 25న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. డిసెంబర్ 1న బయటకు
వచ్చేసింది. ఈ క్రమంలో చందమామ ఉపరితలానికి 127 కిలోమీటర్ల దూరం వరకూ
వెళ్లింది. కొద్దిరోజుల కిందట ఒరాయన్ ప్రధాన ఇంజిన్ను 3.5 నిమిషాల పాటు
మండించడం ద్వారా దాన్ని భూమి దిశగా తిరుగు ప్రయాణానికి సన్నద్ధం చేశారు.
ఆదివారం రాత్రి ఈ క్యాప్సూల్ గంటకు 39,400 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి
ప్రవేశించింది. ఈ క్రమంలో వాతావరణ రాపిడి వల్ల దాదాపు 3వేల డిగ్రీల సెల్సియస్
ఉష్ణోగ్రతను ఒరాయన్ ఎదుర్కొంది. వ్యోమనౌకకు ఏర్పాటు చేసిన ఉష్ణ కవచం ఈ వేడి
నుంచి రక్షించింది. అనంతరం పారాచూట్లు క్రమపద్ధతిలో విచ్చుకొని, ఒరాయన్
వేగాన్ని తగ్గించాయి. అంతిమంగా వేగం గంటకు 30 కిలోమీటర్లకు తగ్గింది.
మెక్సికోకు చెందిన గ్వాడాలూప్ దీవి సమీపాన పసిఫిక్ మహాసముద్రంలో భారత
కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.10 గంటలకు ఈ వ్యోమనౌక దిగింది. మొత్తం మీద
ఒరాయన్ 14 లక్షల మైళ్లు ప్రయాణించింది. పుడమి నుంచి 4.32 లక్షల కిలోమీటర్ల
దూరం వెళ్లింది. మానవ రవాణా యోగ్యత ఉన్న ఒక వ్యోమనౌక ఇంత దూరం వెళ్లడం ఇదే
మొదటిసారి.